తెలుగు360 రేటింగ్ 2.75/5
కథ కొత్తదా పాతదా అనేది ముఖ్యం కాదు. వినోదం పండిందా లేదా అనేదే కీలకం. అది దృష్టిలో ఉంచుకొనే కథలు సిద్ధం చేస్తుంటారు దర్శకులు. తెలిసిన కథల్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసేవాళ్లే ఎక్కువ. ముఖ్యంగా ఆ విషయంలో యువ దర్శకులకి చాలా స్పష్టత వుంది. కథ పాతదే అయినా, తాము చూసిన కొత్త ప్రపంచాన్ని ప్రతిబింబించే సన్నివేశాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. `నన్ను దోచుకుందువటే` విషయంలోనూ అదే జరిగింది. కొత్త దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు చేసిన ఆ ప్రయత్నం ఎంతవరకు వినోదాన్ని పంచింది? `సమ్మోహనం`తో మంచి విజయాన్ని అందుకొన్న సుధీర్‌బాబుకి, నిర్మాతగా కూడా మారి చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలుసుకునేముందు కథలోకి వెళదాం…
కథ
ఐటీ కంపెనీలో మేనేజర్ కార్తీక్ (సుధీర్‌బాబు). అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించి, తన తండ్రి మొహంలో సంతోషాన్ని చూడాలనేది ఆయన కల. అందుకోసం పనే తన ప్రపంచంలా బతుకుతుంటాడు. తన ఆఫీసులో పనిచేసేవాళ్లు కూడా అలాగే ఉండేలా చూస్తూ, ఏమాత్రం క్రమశిక్షణ లేకపోయినా బయటికి పంపుతుంటాడు. అలాంటి కార్తీక్ అనుకోకుండా సిరి (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. సిరి తన జీవితంలోకి రావడానికి కారణం కూడా కార్తీకే. తన పెళ్లి విషయంలో ఇంట్లో చెప్పిన ఓ అబద్ధంవల్ల షార్ట్‌ఫిల్మ్‌లో నటించే ఇంజినీరింగ్ అమ్మాయైన మేఘన (నభా నటేష్) కొన్నాళ్లపాటు తన ప్రేయసిగా నటించడానికి వస్తుంది. కానీ ఆ ఇద్దరూ ప్రేమలో పడతారు. మనసులో ఉన్న ఆ ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకోవడానికి పరిస్థితులే సహకరించవు. మరి ఈ ఇద్దరూ కలిశారా లేదా? అమెరికా వెళ్లాలన్న కార్తీక్ లక్ష్యం ఏమైంది? తదితర విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
విశ్లేషణ
ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఓ సున్నితమైన కథ ఇది. దానికి తగు పాళ్లలో హాస్యాన్ని జోడించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తెలిసిన కథే అయినప్పటికీ… ప్రస్తుత పరిస్థితులకి దగ్గరగా ఉండేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఐటీ ఆఫీస్ వాతావరణం, షార్ట్‌ఫిల్మ్ నేపథ్యాన్ని చక్కగా వాడుకొని వినోదాన్ని పండించాడు. దాంతో సినిమా సరదాగా సాగిపోతుంది. కథానాయకుడి మనస్తత్వాన్ని పరిచయం చేస్తూనే, నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఐటీ ఆఫీస్‌లో ఉద్యోగులు, అందులో స్ట్రిక్ట్ బాస్ వ్యవహారం వంటి నేపథ్యం చక్కటి వినోదాన్ని పంచుతుంది. కథానాయిక ఎంట్రీ ఇచ్చాక ఆ వినోదం మరో స్థాయిలో పండుతుంది. కథలో ఆసక్తికరమైన విషయం ఏదీ లేకపోయినా… తొలి సగభాగమంతా కూడా సరదా సరదాగా సాగుతుంది. ద్వితీయార్థంలో మంచి డ్రామా, ఆసక్తికరమైన అంశాల్ని చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు మాత్రం తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలపై మాత్రమే దృష్టిపెట్టాడు. దాంతో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ప్రి క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగాలు పండటంతో సినిమాకి కలిసొచ్చింది.
నటీనటులు.. సాంకేతికత
హీరోహీరోయిన్ల చుట్టూనే సినిమా సాగుతుంది. సుధీర్‌బాబు, నభా నటేష్‌లు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి చక్కటి అభినయం ప్రదర్శించారు. ముఖ్యంగా కథానాయకుడు సుధీర్‌బాబు స్ర్టిక్ట్ బాస్‌గా సీరియస్‌గా కనిపిస్తూనే నవ్వించడం, తండ్రి సంతోషం కోసం కష్టపడే తనయుడిగా భావోద్వేగాలు పండించిన విధానం బాగుంది. నభా నటేష్ హావభావాల విషయంలో అక్కడక్కడా తేలిపోయినట్టు అనిపించినప్పటికీ… పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. వినోదం బాగా పండించింది. సుదర్శన్, వేణు, వైవా హర్ష తదితరులు పరిధి మేరకు చక్కటి హాస్యం పండించారు. నాజర్ హీరోకి తండ్రిగా, తులసి హీరోయిన్‌కి తల్లిగా భావోద్వేగాలు పండించారు. సాంకేతికంగా సినిమా మెజారిటీ విభాగాల్లో ఉత్తమంగా అనిపిస్తుంది. పాటల పరంగా కాస్త లోటు అనిపించినా, నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అజనీష్ చక్కటి పనితీరు కనబరిచాడు. సురేష్ రగుతు కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్‌పై మరికాస్త దృష్టిపెట్టాల్సింది. ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపించడం సినిమాకి మైనస్‌గా మారింది. సుధీర్‌బాబుకి నిర్మాతగా తొలి చిత్రమే అయినా ఎక్కడా రాజీ పడకుండా నాణ్యంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆర్.ఎస్.నాయుడు షార్ట్ ఫిల్మ్స్ తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడయ్యాడు. ఆయన చూసిన షార్ట్ ఫిల్మ్‌ల వాతావరణాన్ని ఈ సినిమాలో చక్కగా వినియోగించుకున్నాడు. కథ, కథనాల పరంగా కూడా చాలా స్పష్టతతో తాను అనుకొన్నది తెరపైకి తీసుకొచ్చాడు. తొలి ప్రయత్నం పరంగా చూస్తే ఆయన దర్శకుడిగా మంచి పనితీరును కనబరిచినట్టే.
తీర్పు
పాత కథని కొత్తగా చెప్పడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. తొలి సగభాగం ఆద్యంతం సరదాగా, కాలక్షేపానికి ఏమాత్రం లోటు లేకుండా సాగుతుందీ చిత్రం. ద్వితీయార్థంలో కాస్త సాగదీతగా అనిపించే సన్నివేశాల్ని మినహాయిస్తే ఫర్వాలేదనిపిస్తుందీ చిత్రం.
తెలుగు360 రేటింగ్ 2.75/5