Napoleon Telugu Movie Review, Napoleon Movie Review
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నాలు ఇటీవల తెలుగులో ఎక్కువగా జరుగుతున్నాయి. స్టార్లు లేని సినిమాలకి బలం కూడా అదే. కథే హీరోగా అనుకొన్నప్పుడు థియేటర్ వరకు ప్రేక్షకుడిని తీసుకురావాల్సింది ప్రచారమే. ఆ విషయంలో `నెపోలియన్` ముందున్నాడు. నీడ పోయిందంటూ సాగే ప్రచార చిత్రాలు ఆ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రతినిధి సినిమాతో రచయితగా నిరూపించుకొన్న ఆనంద్ రవి, మరో కొత్త కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడనే భావనని కలిగించాయి. ఈసారి ఆయన దర్శకత్వం చేయడంతో పాటు, హీరోగానూ నటించాడు. మరి ఆయన ఈసారి ఎంచుకొన్నకథ ఎలాంటిది? అసలు నీడ ఏమైపోయింది? తదితర విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…
* కథ
తన నీడ పోయిందంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు నెపోలియన్ (ఆనంద్ రవి). అదొక సంచలన విషయంగా మారుతుంది. అంతటితో ఆగక తనకి దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ ఓ హత్య కేసు గురించి చెబుతాడు. ఇంతలో నెపోలియన్ తన భర్త అంటూ స్రవంతి (కోమలి) పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. అతని అసలు పేరు అశోక్‌కుమార్ అని చెబుతుంది. నెపోలియన్ మాత్రం తాను స్రవంతి భర్త కాదని చెబుతాడు. ఇంతకీ నెపోలియన్కి హత్య కేసు విషయం ఎలా తెలిసింది? ఆ హత్యతో అతనికున్న సంబంధమేమిటి? స్రవంతి చెప్పినట్టుగా అతను ఆమె భర్తేనా కాదా? అతని నీడని ఎవరు మాయం చేశారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* విశ్లేషణ
ఒక హత్య కేసు చుట్టూ సాగే చిత్రమిది. దానికి ఆత్మతో పాటు, సోషల్ ఎలిమెంట్స్‌ని ముడిపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆత్మ వరకు బాగానే ఉన్నా… సోషల్ ఎలిమెంట్స్ విషయాలే ఈ కథలో అసలేమాత్రం పొసగలేదు. దాంతో రేసీ థ్రిల్లర్‌గా సాగాల్సిన సినిమా కాస్త నత్తనడకన ముందుకెళ్తుంది. ఆరంభం నుంచే ఈ కథ వేగం అందుకొంటుంది. నీడ పోయిందంటూ పోలీసు స్టేషన్లో నెపోలియన్ ఫిర్యాదు వచ్చాక ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనమైపోతాడు. అదే ఓ ఆసక్తికరమైన అంశం అనుకొంటే… దానికితోడు మరో విషయాన్ని బయటపెడతాడు నెపోలియన్. తనకి దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ హత్యకేసు గురించి వివరిస్తాడు. వాటికి సమాధానం కనుక్కొనేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసేకొద్దీ షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఆత్మ అనీ, హత్య కేసులో నెపోలియన్ పాత్ర కూడా ఉందనే విషయాలు కథలో కీలకమలుపులకి కారణమవుతాయి. ఇదంతా ఒకెత్తైతే, ద్వితీయార్థంలో మరో మలుపు సినిమా గమనాన్నే మార్చేస్తుంది. అప్పటిదాకా అసలు ఈ కేసుతో సంబంధమే లేదనుకొన్న పాత్రే అక్కడ ప్రధానమైపోతుంది. ఇలా అడుగడుగున వచ్చే ఓ కొత్త ట్విస్టు సినిమాపై ఆసక్తి రేకెత్తించినా.. అవి అప్పుడప్పుడు ఆ ట్విస్టులు మరీ మోతాదుకి మించినట్టు కూడా అనిపిస్తుంటాయి. ఎవరూ ఊహించనటువంటి పాత్ర హత్య కేసులో కీలకం అని తెలిశాక వచ్చే కథ, అక్కడ సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్త కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తాయి. అక్కడ దర్శకుడు కథని క్లారిటీగా చెప్పడంలో తడబడ్డాడు. దర్శకుడు ఓ కథకి రకరకాల రంగులు పులమడంతో అది ఎటూ కాకుండా అయింది. ఫక్తు క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా చేసుంటే ఫలితం మరోలా ఉండేదేమో.
* నటీనటులు
ఆనంద్ రవి, కోమలి, రవి వర్మల పాత్రలే ఈ సినిమాకి కీలకం. ఆ ముగ్గురూ బాగా నటించారు. ఆనంద్ రవికి తొలి చిత్రం కావడంతో కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పండలేదు. ప్రతిచోటా ఒకలాగే కనిపించాడాయన. తెలుగమ్మాయి కోమలి చాలా బాగా నటించింది. ఆమె క్యారెక్టర్లో రెండు షేడ్స్ కనిపిస్తాయి. రవి వర్మ సర్కిల్ ఇన్స్పెక్టర్గా తనకి అలవాటైన పాత్రని చాలా బాగా చేశాడు. కొత్తవాళ్లు చేసిన ఇతరత్రా పాత్రల గురించి చెప్పుకోవల్సినంత ఏమీ లేదు.
* సాంకేతికత
దర్శకుడిగా ఆనంద్ రవికి ఇదే తొలి చిత్రమైనప్పటికీ, పలు మలుపులున్న కథని చాలా బాగా డీల్ చేశాడు. ఆయనలోని రచయిత తరచుగాబయటికి తొంగి చూస్తాడు. ప్రతినిధి తరహాలోనే సోషల్ ఎలిమెంట్స్ గురించి చెప్పాలనే ప్రయత్నం చేశాడు. అది ఒకింత మైనస్ అయింది. ఛాయాగ్రహణం చాలా బాగుంది. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు దీటుగా ఉన్నాయి.
* తీర్పు
ఒక కథని రాసుకొంటున్నప్పుడే దాని టార్గెట్ ఏంటన్నది తెలిసిపోతుంది. ఆ టార్గెట్‌కి తగ్గట్టుగానే స్క్రిప్టుని మరింత పకడ్బందీగా సిద్ధం చేయాలి, సినిమాని తీయాలి. అలా కాకుండా… దానికి అనవసరమైన విషయాల్ని జోడించి ప్రచారం చేస్తే బయట ఒకటి, లోపల మరొకటి అన్న చందంగా మారుతుంది. `నెపోలియన్` అందుకు భిన్నమేమీ కాదు. ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగాల్సిన ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ… రకరకాల మెలికలవల్ల అటూ ఇటూ కాకుండా అయిపోయింది.
* ఫైనల్ టచ్:
నీడ పోయింది.. కథ పట్టు తప్పింది.
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5