హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య, దివంగత ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి ఇవాళ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన తండ్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న నిర్వహించే రక్తదాన శిబిరం విశేషాలను తెలియజేశారు. తెలుగు జాతికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆ మహానుభావుడికి కూతురుగా పుట్టటం తన అదృష్టమని చెప్పారు. రక్తదానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. తాము నిర్వహించబోతున్న రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ అభిమానులందరూ పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలలోనూ 200 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మొత్తానికి భువనేశ్వరి ఇవాళ మీడియాతో మాట్లాడటంతో చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చేసినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోకేష్ భార్య బ్రహ్మణి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున అందించే ఉచిత జాబ్ కోచింగ్ గురించి, మోడల్ స్కూల్స్ గురించి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భువనేశ్వరి కూడా బయటకు రావటంతో ఫ్యామిలీ అంతా ప్రజా సేవలో నిమగ్నమయినట్లయింది.