నందమూరి బాలకృష్ణ 101 వ సినిమాకి దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఫిక్సయ్యాడు. అయితే అంతకు ముందు… చాలా పేర్లు వినిపించాయి. అందులో ఎస్ వీ కృష్ణారెడ్డి, కెఎస్ రవికుమార్, శ్రీవాస్ పేర్లున్నాయి. చివరికి పూరికే ఛాన్స్ దక్కింది. పూరి ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వడం వెనుక బాలయ్య కుమార్తె బ్రాహ్మణి హస్తం ఉందన్నది టాలీవుడ్ టాక్. ఈమధ్య బాలయ్య సినిమా విషయాల్లో బ్రాహ్మణి బాగానే ఇన్ వాల్వ్ అవుతోందని, కథలు కూడా శ్రద్దగా వింటోందని తెలుస్తోంది. నిజానికి 101వ సినిమా ఎస్ వీ కృష్ణారెడ్డికే వెళ్లాల్సింది. బాలకృష్ణ – కృష్ణారెడ్డి కాంబోలో అప్పట్లో టాప్ హీరో సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా, కృష్ణారెడ్డి ఫామ్ లో లేకపోయినా, ఆయన వెటరన్ అయిపోయినా సరే.. ఇవేం పట్టించుకోకుండా బాలయ్య కథ విన్నాడు. ఆ కథ బాలయ్యకు నచ్చడం.. `చేసేద్దాం` అంటూ బాలయ్య కూడా ఉత్సాహపడడం జరిగిపోయాయని టాక్. కృష్ణారెడ్డి కూడా ఓ శుభ ముహూర్తంలో అఫీషియల్ ప్రకటన ఇచ్చేద్దాం అంటూ రెడీ అయ్యాడట. దానికి తోడు కెమెరామెన్నీ, డైలాగ్ రైటర్నీ ఫిక్స్ చేసుకొన్నార్ట. కానీ.,. చివరి నిమిషంలో బాలయ్య ఈ ప్రాజెక్టుని హోల్డ్‌లో పెట్టాడట. లేదంటే… కృష్ణారెడ్డితో సినిమా పట్టాలెక్కాల్సిందేనని నందమూరి కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.
పూరి ఓ కథ వినిపించడం, కృష్ణారెడ్డి కంటే.. పూరినే బెటర్ ఆప్షన్ అనుకోవడం వల్ల.. దానికి తోడు.. బాలయ్య కుమార్తె బ్రాహ్మణి సలహాలను వినడం వల్ల… కృష్ణారెడ్డి కథని పక్కన పెట్టారని సమాచారం. ఈమధ్య బాలయ్య సినీ వ్యవహారాల్లో బ్రాహ్మణి జోక్యం చేసుకొంటోందని, ఆమె మాటకు బాలయ్య ‘నో’ చెప్పడం లేదని, పూరి ప్రాజెక్టు సెట్ అవ్వడానికి కూడా బ్రాహ్మణినే కారణమని తెలుస్తోంది.