హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి సమాజసేవలోకి దిగారు. ఇంతవరకు హెరిటేజ్ డైరీ వంటి వ్యాపారాలను చూసుకున్న బ్రాహ్మణి ఇప్పుడు సేవా కార్యక్రమాలద్వారా ప్రత్యక్షంగా సేవారంగంలోకి దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్లో బ్రాహ్మణి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు మంచి మంచి అధికారులు అవసరమని, అలాంటి మంచి అధికారులను తయారు చేయటం తమ లక్ష్యమని చెప్పారు. వివిధ రంగాలలో నిపుణులతో పేద విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా 60 మంది ఎంపిక చేసుకుని గ్రూప్ 1,2 ఉద్యోగాలకు పరీక్షల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు రు.30 లక్షలు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. కార్యకర్తల పిల్లల్లో వృత్తి నైపుణ్యం పెంచటమే లక్ష్యమని అన్నారు. 2016లో కృష్ణా, వరంగల్ జిల్లాలలో స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. కేజీ నుంచి పీజీ దాకా నాణ్యమైన చదువు అందించటం తమ ఆశయమని తెలిపారు. తర్వాతి దశలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలోనూ స్కూల్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 2005లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ప్రారంభించామని, గత పదేళ్ళలో ఆ స్కూల్స్ ద్వారా వేలాది మంది పిల్లలకు ఉచితవిద్యను అందించామని చెప్పారు. జూనియర్ కాలేజ్ కూడా ప్రారంభించినట్లు తెలిపారు.