తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు తొలి రోజు… ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ కావడం.. ఆ పార్టీ నేతల్ని సంతోష పరుస్తోంది. కొత్త ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల నుంచి ఇంత మద్దతు వస్తుందని.. టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తి బయట పడుతోందని అంటున్నారు. ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తూ..తొమ్మిది నెలల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాచైతన్యయాత్ర చేపట్టారు ప్రతిపక్షనేత ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. స్థానిక ఎన్నికల కారణంగా… గ్రామ స్థాయిలో టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కేసుల పేరుతో బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందో.. అని టీడీపీ నేతలు కాస్త ఆందోళనకు గురయ్యారు. కానీ.. చంద్రబాబు పర్యటన ప్రారంభమైన కాసేపటికే.. ఆ ఆందోళన పటాపంచలైంది. ప్రకాశం జిల్లాకు వెళ్లే దారిలో ప్రతీ చోటా.. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
పర్యటన మొత్తం అడుగడుగునా జనసందోహం కనిపించింది. మార్టూరులో నిర్వహించిన బహిరంగసభకు… భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. నేతలు జన సమీకరణ చేయకపోయినప్పటికీ.. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. మేదరమెట్లలోనూ… టీడీపీ క్యాడర్ కదం తొక్కింది. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో.. పార్టీ క్యాడర్ ను నిరాశా నిస్ప్రహల నుంచి బయటకు తేవాలంటే.. యాత్రను చేయాలనుకున్న టీడీపీ అధినేత..దాని కోసం పక్కా ప్రణాళిక వేసుకున్నారు. తొలి రోజు యాత్ర.. తరలి వచ్చిన జన సందోహం.. టీడీపీ నేతలకు ఆనందాన్ని కలిగించింది.
సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు… ప్రజల్లో సానుకూలత ఉంటుంది. ఒకటి , రెండేళ్ల పాటు పెద్దగా వ్యతిరేకత కనిపించదు. కానీ ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని… చంద్రబాబు పర్యటనకు వచ్చిన స్పందనే తెలియచేసిందని అంటున్నారు. పెద్ద సంఖ్యలో పెన్షన్లు తీసివేయడం.. అనర్హులకు పథకాలు అందించడం.. రేషన్ కార్డులు ఎత్తివేయడం.. ఎవరికీ సరిగ్గా పథకాలు అందకపోవడం వంటి అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోందంటున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేలా చంద్రబాబు కూడా తన ప్రసంగాలు ఉండేలా చూసుకున్నారు.