అచ్చెన్నాయుడు కుటుంబం మొత్తం వైసీపీలో చేరితే యాభై కోట్ల రూపాయలు ఇస్తామని ప్రభుత్వ సలహాదారు ఆఫర్ చేసింది నిజం కాదా.. అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్…వైసీపీని సూటిగా ప్రశ్నించారు. ఆ ఆఫర్‌కు లొంగనందుకే కక్ష కట్టి.. అచ్చెన్నాయుడుని ఆధారాలు లేని కేసులో.. అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. అన్నీ రాసుకుంటున్నామని.. బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. దొంగ కేసులు పెడితే భయపడబోమని.. జగన్ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
వ్యాపారస్తులైన టీడీపీ నేతల్ని.. వ్యాపార పరంగా ఇబ్బంది పెట్టి వందల కోట్లు ఫైన్లు వేసి.. పార్టీలో చేర్చుకున్న తర్వాత రద్దు చేస్తున్నారని.. విద్యా సంస్థలు ఉన్న వారిని కూడా అదే విధంగా బెదిరిస్తున్నారని… ఏ వ్యాపారాలు లేని వాళ్లకు డబ్బులు ఎర వేసి.. పార్టీలో చేర్చుకుంటున్నారని.. ఆరోపణలు టీడీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. కొంత మంది నేతల చేరికలకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ కోణంలో అచ్చెన్నాయుడు కుటుంబానికి రూ. యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారనే విషయం లోకేష్ బయట పెట్టడం రాజకీయ కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
జేసీ ప్రభాకర్ రెడ్డి.. జగన్ లా ఆర్థిక నేరస్తుడు కాదని.. స్వాతంత్రానికి పూర్వం ముందు నుంచీ వారు రవాణా రంగంలో ఉన్నారని గుర్తు చేశారు. మాకేం కాలేదులే అని ప్రజలు చూస్తూ ఊరుకుంటే… గజదొంగలు ప్రజలపై పడతారని హెచ్చరించారు. పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్… అందర్నీ జైలుకు పంపించాలనుకుంటున్నారని.. మండిపడ్డారు. తప్పు చేశారు కాబట్టి.. బెయిల్ రాకుండా.. పదహారు నెలలు జైల్లో ఉన్నారని లోకేష్ విమర్శించారు. ఎన్ని చేసిన తమ మనో స్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. అంతకు అంత బదులు తీర్చుకుంటామని తేల్చేశారు.
అనంతపురం జైలులో కరోనా ఉందంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కడప జిల్లా జైలుకు తరలించారు. ఆ జైలు ఉన్న ప్రాంతం కరోనా హాట్ స్పాట్. కావాలనే ఉద్దేశపూర్వకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి అక్కడికి తరలించారని జేసీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లోకేష్ నేరుగా కడపకే వెళ్లి జైలులో వారిని పరామర్శిద్దామనుకున్నారు. కానీ..ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో.. అనంతపురం జిల్లా తాడిపత్రికి వచ్చి పరామర్శించారు.