నారా లోకేష్ లాక్ డౌన్ సమయాన్ని చాలా పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. వ్యక్తిగత గోల్స్ సాధించారు. తన బరువును రెండు నెలల్లో కనీసం ఇరవై కిలోల మేర తగ్గించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించిన లోకేష్‌ను చూసి మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. అంత సన్నగా అయిపోయారేమిటని.. కుతూహలం పట్టలేక అడిగేశారు కూడా. కరోనా లాక్ డౌన్ తనకు.. ఫిట్నెస్ గోల్స్ సాధించడానికి ఉపయోగపడిందని ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పుకొచ్చారు. రెండు నెలల కఠోరమైన డైట్..సాధన చేసి.. ఇరవై కేజీల బరువు తగ్గానన్నారు. గతంలో పోలిస్తే..లోకేష్ చాలా స్లిమ్‌గా మారిపోయారు.
తెలుగుదేశం పార్టీ మహానాడును డిజిటల్‌మోడ్‌లో నిర్వహించారు. అందరూ ఎవరి ఇళ్లలో వారు ఉండి.. మహానాడులో పాల్గొంటున్నారు. కొన్ని వేల మంది ఆన్ లైన్ ద్వారా పాల్గొంటున్న ఈ మహానాడు టెక్నికల్ ఏర్పాట్లన్నింటినీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పాల్గొంటున్న ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. లాక్ డౌన్ తర్వాత లోకేష్ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని..స్లిమ్ అయ్యేందుకు తన సమయాన్ని వెచ్చించారు. మామూలుగా.. పార్టీ అధికారంలో ఉన్నా..లేకపోయినా… లోకేష్ చాలా బిజీగా ఉండేవారు. పార్టీ కార్యక్రమాలు..కార్యకర్తలను కలవడంలో తీరిక లేకుండా ఉండేవారు.
దాంతో ఆయనకు ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టే సమయం ఉండేది కాదు. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా… ఎలాంటి కార్యకలాపాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోవడం కలిసి వచ్చింది. ఖాళీగా ఇంట్లో ఉంటే… అదే పనిగా తిని లావయిపోతామని..సోషల్ మీడియాలో చాలా మంది సెటైర్లు.. జోకులు వేసుకున్నారు. కానీ లోకేష్ మాత్రం సన్నంగా మారిపోయి పార్టీ నేతలందర్నీ ఆశ్చర్యపరిచారు.