అధికార పార్టీకి చెందిన నేతల, మంత్రులు, ప్రజా ప్రతినిధుల బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెడుతుండటం మన దేశంలో కొత్తేమీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని అందుకు విమర్శించే రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తుంటాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో అతని కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడని, ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెడుతున్నాడని తెదేపా విమర్శించేది. జగన్ పై మోపబడిన 11 చార్జ్ షీట్లు అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చూపుతుంటుంది.
కానీ ఇప్పుడు నారా లోకేష్ కూడా ప్రభుత్వ వ్యవహారాలలో వేలుపెడుతున్నారని తరచూ వార్తలు వస్తున్నా వాటిని తెదేపా కొట్టి పడేస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ లైట్ చేసి ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని చెప్పక తప్పదు.
తాజా సమాచారం ప్రకారం తెదేపా ప్రధాన కార్యాలయం-ఎన్.టి.ఆర్.ట్రస్టు సి.ఈ.ఓ.గా పనిచేసిన సి.కొండయ్యను నారా లోకేష్ పరిశ్రమల శాఖలో ప్రత్యేక అధికారిగా నియమింపజేయగా, ఆ శాఖలో కమీషనర్ గా పనిచేస్తున్న కార్తికేయ మిశ్రా ఆయన నియామకాన్ని ఆమోదించలేదని తెలుస్తోంది. కొండయ్య ఆ విషయాన్ని నారా లోకేష్ కి పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తను సిఫార్సు చేసిన వ్యక్తిని కమీషనర్ అంగీకరించలేదు కనుక నారా లోకేష్ తన సిఫార్సును ఉపసంహరించుకొంటారని భావించలేము. కనుక నేడో రేపో సదరు కమీషనర్ పై బదిలీ వేటు పడినా ఆశ్చర్యం లేదు. నారా లోకేష్ ఇటువంటి వ్యవహారాలలో వేలు పెట్టడం నిజమయితే దానిని ఖండించక తప్పదు. నారా లోకేష్ ఇంతవరకు పార్టీ వ్యవహారాలను చూసుకోవడం వరకే పరిమితమయ్యేవారు. కానీ ఈవిధంగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోదలచుకొంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎన్నికలలో పోటీ చేసి ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొన్నట్లయితే ఎవరూ ఈవిధంగా ఆక్షేపించారు. లేకుంటే తనను, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించేందుకు ఆయనే ప్రతిపక్షాలకు చేజేతులా అవకాశం కల్పించినవారవుతారు.