రాజకీయ ప్రత్యర్దులయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరూ ప్రస్తుతం కడప జిల్లాలో మకాం వేసి ఉన్నారు. చిత్రమేమిటంటే ఇద్దరు కూడా వైకాపా కోసమే వచ్చేరు. వారిలో లోకేష్ వైకాపాని ఖాళీ చేయాలని వస్తే, జగన్మోహన్ రెడ్డి అతని బారి నుండి తన పార్టీ నుండి కాపాడుకోవాలని వచ్చేరు. వారి ఈ వ్యవహారం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా ఉంది.
నారా లోకేష్ మొదటి ప్రయత్నంలో వైకాపాకు చెందిన కడప మునిసిపల్ కార్పోరేటర్లను తెదేపాలోకి రప్పించే ఆలోచనతో వచ్చినట్లు కనిపెట్టగానే జగన్మోహన్ రెడ్డి వారితో సమావేశమయ్యి ప్రలోభాలకు, బెదిరింపులకి లొంగవద్దని, తనతో కలిసి మరో రెండేళ్ళు పనిచేస్తే అధికారం మనదేనని అప్పుడు అందరి ‘రుణం’ తీర్చుకొంటానని హామీ ఇచ్చారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అయన సమావేశమయ్యి వారికీ అదే మాట చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఘోర పరాభవం పొందిన తరువాత నారా లోకేష్ ఈ ‘మిషన్ ఆకర్ష’ కోసం కడప వచ్చేరు. కానీ జగన్ అప్రమత్తత కారణంగా జిల్లా నుండి ఎవరినీ పార్టీలోకి రప్పించలేకపోయినట్లయితే మళ్ళీ అవమానం తప్పదు. హైదరాబాద్ కె.టి.ఆర్. చేతిలో పరాభవం పొందిన లోకేష్ మళ్ళీ ఇప్పుడు కడపలో జగన్మోహన్ రెడ్డి చేతిలోనూ పరాభవం పొందినట్లు అవుతుంది. అది అయన రాజకీయ భవిష్యత్ కి ఏమాత్రం మంచిది కాదు. వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి కడపలోనే ఉన్నప్పటికీ జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు కనుక ఆయన పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఆయననయినా తెదేపాలో చేర్పించలేకపోతే లోకేష్ పరువు నిలబడదు.