అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న యువనేస్తం పథకంపై తొలి సమీక్షను మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్ర నిర్వహించారు. ఇప్పటివరకూ ఈ పథకం కింద రెండున్నర లక్షల మందిని అర్హులుగా గుర్తించిన సంగతి తెలిసిందే. వీరిలో 1 లక్ష 64 వేల మందికి రూ. వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించారు. అయితే, పథకం అమలు తొలి దశలో ఉంది కాబట్టి… లక్షకుపైగా ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిలో ఇప్పటికే సుమారు 75 శాతం పరిష్కరించామనీ అధికారులు చెప్పారు.
నిరుద్యోగ భృతి తమకు వద్దు అంటూ స్వచ్ఛందంగా వదులుకుంటున్నవారు కూడా కొంతమంది ఉన్నట్టు సమీక్షసమావేశంలో దృష్టికి వచ్చిందని సమాచారం. అయితే, ఇలాంటి వారికి వెంటనే ప్రభుత్వ కాల్ సెంటర్ నుంచీ ఫోన్లు చేసి కారణాలను తెలుసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వంపై భారం తగ్గించే క్రమంలో తమ వంతు బాధ్యతగా రూ. వెయ్యిని వదులుకుంటామనే సమాధానాలు కూడా కొంతమంది నుంచి కాల్ సెంటర్ కి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎంపికైనవారికి భృతి అందకపోతే.. సాంకేతికంగా ఉన్న ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించి, సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఇంకోపక్క, సాధికార మిత్రల ద్వారా ప్రతీ 30 కుటుంబాలకు ఒకరు చొప్పున క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ… ఆయా కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగుల విద్యార్హతలు, వారి నైపుణ్యాలను తెలుసుకునే ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోందని యువనేస్తం అధికారులు తెలిపారు. నిరుద్యోగుల శిక్షణకు సంబంధించిన కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామనీ, త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభం కాబోతున్నాయనీ అధికారులు చెబుతున్నారు. అర్హులైనవారిందరినీ ఈ పథకం అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. నిజానికి, ప్రతిపక్షం నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శల్లో నిరుద్యోగ భృతి అమలు ఒకటి! అందుకే, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. అందుకే, భృతి అందించడంతోపాటు… శిక్షణ తరగతులు కూడా పూర్తి చేసిన బ్యాచ్ లకు ఉద్యోగాలను కల్పించే ప్రక్రియలో కూడా ప్రభుత్వ సాయం ఉంటుందనే భరోసా కల్పించే దిశగా దీని అమలుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఈ పథకం మరో బలమైన అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.