విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. మంగళవారం ముంబై వెళ్లి టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ తో సమావేశం అయిన తర్వాత నారా లోకేష్ బుధవారం భారీ ప్రకటన చేస్తానని ట్వీట్ చేశారు. దాంతో నారా లోకేష్ ఏ ప్రకటన చేయబోతున్నారన్నది చర్చనీయాంశం అయింది. తాజాగా ఆ ప్రకటన దేనిగురించో తెలిపారు. విశాఖలో టీసీఎస్ పదివేల ఉద్యోగాలు కల్పించే క్యాంపస్ ను ఏర్పాటు చేయనునంది.
నారా లోకేష్ టాటా సన్స్ కార్పొరేట్ కార్యాలయంలో చైర్మన్కు ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విశాఖలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. సంతృప్తి చెందిన చంద్రశేఖరన్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ తమ సెంటర్ను విశాఖలో నెలకొల్పుతామని, 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీ, ఎయిరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలుపై పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకెళ్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం ఆదేశాలతో, తాను యువతకి-రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట మేరకు మంత్రి నారా లోకేష్ ప్రఖ్యాత కంపెనీలను రప్పించేందుకు ప్రయత్నాలు చేసి విజయవంతం అవుతున్నారు. లులూ, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు విశాఖలో ఐటీ రంగానికి ఓ గొప్ప మలుపు అవుతుందని అనుకోవచ్చు.