నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన అన్నదానం సత్రరాన్ని అటవీ అధికారులు కూల్చేశారు. అటవీ ప్రాంతంలోఉండటంతో వారీ నిర్ణయం తీసుకున్నారు. టైగర్ జోన్ ఏర్పాటు, అటవీ శాఖ నిబంధనల కారణంగా కూల్చకతప్పలేదు. ఈ విషయాన్ని కొంత మంది సోషల్ మీడియాలో నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని కూల్చేసిన కట్టడాలని తిరిగి తాను నిర్మిస్తానని భక్తులకు హామీకు ఇచ్చారు.
నిజానికి ఇది అటవీ శాఖ ఇష్యూ. అంటే పవన్ కల్యాణ్ శాఖ. ఆయన చూసుకోవాల్సి ఉంది. కానీ నారా లోకేష్ స్పందించారు. ఈ కూల్చివేత అంశం పవన్ కల్యాణ్ దృష్టిలో ఉందోలేదో స్పష్టత లేదు. కానీ కూల్చివేత జరిగింది. తప్పు జరిగిందన్నట్లుగా నారా లోకేష్ క్షమాపణ చెప్పి.. తాను మళ్లీ కట్టిస్తానని చెప్పడం మాత్రం అటవీ శాఖ అధికారులకు ఇబ్బందికరమే. పార్టీ ప్లీనరీ విషయంలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
కాశినాయన ఆశ్రమాలు చాలా ఉన్నాయి. కడప జిల్లాలోని బద్వేలు సమీపంలో ఉన్న ఆశ్రమం పెద్దది. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. కాశి నాయన 104 ఏళ్ల వయస్సు లో 1999లో దేహం చాలించారు. ఆయన పేరు మీద అప్పటి ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాయలసీమ ప్రాంతంలో కాశీనాయనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. కానీ ఈ ఆశ్రమాలు ఎక్కువగా అటవీ స్థలాల్లోనే ఉండటం వల్లనే సమస్యలు వస్తున్నాయి.