గ్రామ సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడండి జగన్ గారూ అంటూ సంబోధిస్తూ వరుస ట్వీట్లు చేశారు. కళ్లెదురుగా నిజాలు కనిపిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటారంటూ… కార్యకర్తలకే ఉద్యోగాలు అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో పోస్ట్ చేశారు. మా పార్టీ కార్యకర్తలూ అభిమానుల కళ్లలో ఆనందం కోసమే పేపర్ లీక్ చేశామని చెప్పండి జగన్ గారూ అంటూ ఎద్దేవా చేశారు.
రూ. 5 లక్షలకు ప్రశ్న పత్రాన్ని అమ్ముకున్నారని మీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారనీ, గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో 90 శాతం అర్హత పొందినవాళ్లు మనవాళ్లే ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పారని లోకేష్ అన్నారు. ఇప్పటికైనా నోరు తెరవండి జగన్ గారూ అంటూ ఆ ట్వీట్ చివర్లో రాశారు! మరో ట్వీట్లో… మీ పాలన రాష్ట్రానికి శాపమనీ, యువతకు మీ పాలనలో జరుగుతున్న అన్యాయం క్షమించరానిదనీ, వంద రోజుల్లోనే మీ పనితనం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందనీ, అందుకే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యేలు సిగ్గుపడుతున్నారనీ, ఇప్పటికైనా మాట్లాడండి జగన్ గారూ అంటూ స్పందించారు. గతంలో, జరగని పేపర్ లీకేజీ మీద నానా రభస చేశారని గుర్తు చేస్తూ… విచారణ జరిగి ఏం లేదని తేలినా అప్పట్లో ఆగలేదన్నారు. రాజీనామా చెయ్యాలీ, సీబీఐతో విచారణ చెయ్యాలంటూ అప్పట్లో చాలా విమర్శలు చేశారనీ, ఇప్పుడేం చేద్దామో చెప్పాలని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి సంబంధించి అప్పట్లో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాలను కూడా నారా లోకేష్ పోస్ట్ చేశారు.
గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ల లీకేజీపై వరుసగా పోస్టులు పెడుతూ… ఇప్పటికైనా మాట్లాడండి జగన్ గారూ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. గతంలో మంత్రి నారాయణను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన వైకాపా తీరును కూడా గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై చాలా సందేహాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా విజయసాయి రెడ్డి ప్రసంగమూ ఉంది, అది ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తుందో చూడాలి. మొత్తానికి, టీడీపీకి ఇదో పోరాస్త్రంగా మారుతోంది.
5 లక్షలకి పేపర్లు అమ్ముకున్నారని మీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు, గ్రామ వాలంటీర్లు 90%, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగానికి అర్హత పొందినవాళ్ళలో కూడా చాలావరకు మీ వైకాపా అభ్యర్థులే ఉన్నారని మీ ఎంపీ @VSReddy_MP కుండ బద్దలు కొట్టేశారు. ఇప్పటికైనా మాట్లాడండి జగన్ గారూ. #YCPPaperLeakScam
— Lokesh Nara (@naralokesh) September 22, 2019