ముఖ్యమంత్రి జగన్‌ను రాజకీయంగా విమర్శించినందుకు.. అధికారిక కార్యక్రమాలకు రాకుండా లోకేష్‌ను నిషేధించాలని.. వైసీపీ నేతలు నిర్ణయించారు. ఈ వింత గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రులతో పాటు… వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో అభివృద్ధి విషయాల సంగతేమో కానీ.. గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌ను సమావేశాలకు రాకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించారు.
డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని తీర్మానాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యుల అంగీకారం తెలిపారు. నిజానికి డీఆర్సీ సమావేశానికి ఎమ్మెల్సీ లోకేష్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిలకు ఆహ్వానం పంపలేదు. మళ్లీ రాకుండా తీర్మానం చేసేశారు. వైసీపీ నేతలు చేసిన తీర్మానాన్ని టీడీపీ ఎద్దేవా చేసింది. లోకేష్ అంటే అంత భయమెందుకని.. ఆ పార్టీ ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆర్కేను ఆమె కరకట్ట కమల్ హాసన్ గా సంబోధిస్తూ సెటైర్లు వేశారు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబుని ఉరి తియ్యాలి, నడి రోడ్డు పై కాల్చాలి అంటూ మాట్లాడినప్పుడు ఈ కరకట్ట కమల్ హాసన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసుకుంటారు కానీ.. ప్రభుత్వ పరమైన కార్యక్రమాలకు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాకుండా.. ఆపడానికి తీర్మానాలు చేయడం.. చరిత్రలో ఇదే మొదటి సారి కావొచ్చన్న సెటైర్లు పడుతున్నాయి