హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతనైతే ఒక్కరోజులో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. లోకేష్ ఇవాళ కడపజిల్లా పర్యటనకు బయలుదేరారు. మార్గమధ్యంలో తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కరోజులో ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ అన్నారా, లేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వచ్చే ఇతర పార్టీ నేతలను వద్దని చెప్పబోమని లోకేష్ చెప్పారు. చంద్రబాబు నాయుడుపై పదే పదే విమర్శలు చేసే నైతిక హక్కు లేదని అన్నారు. టీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదని ఆరోపించారు. తమకు గ్రేటర్ ఎన్నికల్లో 7 లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.