మార్కెటింగ్. ఈ పదానికి ఉన్న విస్తృతార్థం అంతా ఇంతా కాదు. మార్కెటింగ్ అంటే అంటగట్టడమే అనుకుంటారు చాలా మంది. అమ్మకాల టార్గెట్టే చూస్తారు చాలా మంది. కానీ మార్కెటింగ్ అంటే ఇప్పటికి వారికి అది అవసరం లేకపోయినా రేపటికి రోజున వారి ఆ ఆలోచన వస్తే.. తమ ప్రొడక్టే వారి మదిలోకి వచ్చేలా చేసుకోవడమే మార్కెటింగ్. డోర్ టు డోర్ మార్కెట్ చేసేవారు అమ్మకాలు సాధించలేకపోవచ్చు కానీ.. ఆ ప్రొడక్టు కు చేసే ప్రచారం అంతా ఇంకా కాదు. నేరుగా ఓ మనిషిని కలిసి ఓ ప్రొడక్టు గురించి ప్రభావవంతంగా చెబితే అంతకు మించిన ప్రచారం ఏమి ఉంటుంది ?. ఇప్పుడు ఏపీ కోసం చంద్రబాబు, లోకేష్ పారిశ్రామిక వేత్తల వద్ద అలాంటి మార్కెట్ చేస్తున్నారు.
రాష్ట్రానికి. వంద కోట్ల పెట్టుబడి వస్తే వంద మందికి ఉపాధి వస్తుంది. వంద కుటుంబాలు బాగుపడతాయి. అలాగే రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. అది అలా పెరుగుతూనే ఉంటుంది. అంటే విత్తనం వేస్తే మహావృక్షంలా మారి ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అందుకే పెట్టుబడుల కోసం చంద్రబాబు, లోకేష్ విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఏపీ గురించి దావోస్లో అలుపెరుగకుండా ప్రమోట్ చేస్తున్నారు. నారా లోకేష్ ఒక్క రోజే పదికిపైగా సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రంగంలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో సమావేశం అయ్యారో ఆయా రంగాల్లోఏపీలో ఉన్న అవకాశాల్ని వారికి వివరిస్తూ ఓ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఓ రికార్డు కూడా వారికి ఇస్తున్నారు. వారి దాన్ని తమ బోర్జు సమావేశాల్లో పెట్టి చర్చిస్తామని భరోసా ఇస్తున్నారు. వారి మైండ్ లో ఏపీని చేర్చడం కన్నా గొప్ప మార్కెటింగ్ ఏముంటుంది ?
పెట్టుబడిదారులు ఎప్పుడూ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఇన్వెస్టర్లు. వారికి ఫలానా ప్రాంతంపై ప్రత్యేకమైన అభిమానం ఉండదు. తాము పెట్టే పెట్టుబడికి తగ్గ ఆదాయం ఉంటుంది.. వస్తుంది అనుకుంటేనే వస్తారు. అలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయని వారికి నమ్మకం కలిగించడం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నం. అందులో వారు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎంవోయూలు లక్షల కోట్లలో చేసుకోవచ్చు కానీ.. అసలు ఎంవోయూలు చేసుకోకుండానే ఏపీకి వచ్చే పరిశ్రమలు ఉంటాయి. అదే అసలైన మార్కెటింగ్. చంద్రబాబు, లోకేష్ ఈ విషయంలో తమదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు.