కేసీఆర్, నారా లోకేష్‌లు బాబాయ్ అబ్బాయ్ కావడం ఏమిటా అని క్వశ్చన్ మార్కు ఫేసు పెట్టుకుంటే కుదర్దు. కొద్దిగా దానికి సంబంధించిన నేపథ్యం కూడా తెలుసుకోవాలి.
ఇక్కడేమో గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కార్యకర్తలు, తెరాస కార్యకర్తలు జెండాకర్రలనే ఆయుధాలుగా వాడేసుకుంటూ.. ఛాన్సు దొరికితే చాలు ఉద్రిక్తతలకు దారితీసేలా కొట్టేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో అటు అక్కడ అసలు నాయకులు, పార్టీ అధినేతలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబుకు, చంద్రశేఖరరావు మాత్రం రాసుకుపూసుకు తిరుగుతూ ఉంటారు. దానికి రాజ్యాంగబద్ధమైన స్నేహం మాత్రమే అని ఒక పేరు కూడా పెట్టుకుంటారు. పైగా ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీలో అనుచరుడే అయిన కేసీఆర్, చంద్రబాబునాయుడును తన అన్నగా ఎంతమాత్రం గౌరవిస్తారో తెలియదు గానీ.. చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి పట్ల మాత్రం వదినగా అభిమానం కురిపించారు.
శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని విన్నవారు తొలుత నివ్వెరపోయి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఆయన తన మాటల్లో భాగంగా సహజమైన శైలిలో చంద్రబాబునాయుడు మీద సెటైర్లు వేసిన కేసీఆర్.. వదిన భువనేశ్వరి తెలివైనదని ఆమెను తమ పార్టీ వాళ్లు కలిసినప్పుడు తెరాసకే ఓటు వేస్తానని కూడా చెప్పిందని ప్రకటించారు. నారా చంద్రబాబునాయుడును గెలిపించినా ఆయన ఇక్కడ చేయగలిగింది ఏమీ ఉండదని కూడా వాక్రుచ్చారు. అయితే తెదేపా అధినేత భార్య భువనేశ్వరి తెరాసకు ఓటు వేస్తానన్నదనే ప్రచారం సహజంగానే వివాదం అయింది.
దీనిపై వదిన భువనేశ్వరి స్పందించలేదు గానీ.. ఆమె తరఫున, ఈ బంధుత్వపు వరుసల ప్రకారం బాబాయి కేసీఆర్‌కు అబ్బాయి అయ్యే నారా లోకేష్ స్పందించారు. ‘కేసీఆర్ అబద్ధాలాడుతున్నారు’ అంటూ తల్లి చెప్పినట్లుగా తన ట్వీటర్ అకౌంట్లో ఆయన రాసేశారు. ౖ’ఓటర్లను అయోమయం చేయడానికి నా పేరు వాడుకోవడం దురదృష్టకరం.. నా ఓటు ఎప్పుడూ తెలుగుదేశానికే’ అని భువనేశ్వరి చెప్పినట్లుగా లోకేష్ ట్వీట్ చేశారు.
ఈ వివాదం మొత్తం ఎలా పోయినప్పటికీ.. దీనినుంచి కార్యకర్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. నాయకులు ఇలా పైస్థాయిలో బాబాయి, వదిన, అన్న అనుకుంటూ బంధుత్వాలతో హాయిగా ఉంటారు.. మరి కార్యకర్తలు మాత్రం కక్షలు కార్పణ్యాలతో ఎందుకు రగిలిపోవాలి? కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే ప్రతి వారికీ బోధపడుతుంది.