ముందస్తు ఎన్నికలకు తెలంగాణ సిద్ధమైన తరుణంలో రాష్ట్రంలో టీడీపీ వ్యూహం ఏంటనేది కొంత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ లాబీల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ఆంధ్రా పార్టీ అనే రీతిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలుగువాళ్లంతా ఒకటే అని కేసీఆర్ అనేవారనీ, కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మరోసారి గతంలో మాదిరిగానే జాగోబాగో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటూ లోకేష్ విమర్శించారు. జీహెచ్ ఎంపీ ఎన్నికల్లో ఆంధ్రులు ఓట్లు లేకుండానే తెరాస విజయం సాధించిందా అని ప్రశ్నించారు? తెరాసలో ఇప్పుడున్న నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారేననీ, వాళ్లంతా టీడీపీ అభిమానులూ, ఆంధ్రా ప్రాంతానికి చెందినవారి ఓట్లను వేయించుకున్నవారే కదా అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు ఎంతవరకూ కరెక్ట్ అనే తరహాలో లోకేష్ తప్పుబట్టారు.
లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే… తెలంగాణ జరగబోయే ఎన్నికల్లో టీడీపీ తీసుకోబోతున్న వైఖరి కొంత స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎలాగూ, భాజపాకి దగ్గరయ్యే క్రమంలో తెరాస కనిపిస్తోంది. కాబట్టి, తెరాసకు వ్యతిరేక వైఖరిని తీసుకోవాలని టీడీపీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. అసెంబ్లీ రద్దయిన దగ్గర్నుంచే తెలంగాణలో టీడీపీ వ్యూహం ఎలా ఉండాలనేదానిపై చర్చ మొదలైనట్టు సమాచారం. జగన్, పవన్ లు తరహాలో కేసీఆర్ కూడా భాజపాకి దగ్గరౌతూ… టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి వస్తోందన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. దీనిపై మరింత స్పష్టత 8న వచ్చే అవకాశం ఉంది. శనివారం నాడు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు సమావేశమౌతున్నారు. దీన్లో పొత్తులతో సహా, రాష్ట్రంలో అనుసరించాల్సిన పార్టీ వైఖరిపై క్లారిటీ వచ్చేస్తుందని అనుకోవచ్చు.
ఆ వైఖరి ఎలా ఉండబోతుందనేది లోకేష్ వ్యాఖ్యలో కొంత స్పష్టంగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక, తెలంగాణలో ఆంధ్రా మూలాలున్నవారిని కూడా ప్రభావితం చేసే వ్యూహంలో టీడీపీ ఉందనేదీ తెలుస్తూనే ఉంది! ఆ మధ్య కర్ణాటకలో ఎన్నికలు జరిగితేనే అక్కడ స్థిరపడ్డ ఆంధ్రులు మోడీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విషయంలో కూడా తెరాస, భాజపా ఒకటౌతున్న క్రమంలో… ఇక్కడ కూడా అలాంటి నినాదాన్ని మరోసారి తెరమీదికి తెచ్చినా ఆశ్చర్యం లేదు.