ఏపీలో ప్రధానంగా రెడ్ బుక్ గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని.. అందులో భాగంగానే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ ఎక్కడ పర్యటించినా..రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. రెడ్ బుక్ ద్వారా కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంద న్న విమర్శలకు మంత్రి నారా లోకేష్ తాజాగా మరోసారి కౌంటర్ ఇచ్చారు.
ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు. మంగళగిరిలో నరసింహా స్వామి ఆలయ ముఖ ద్వారాన్ని ప్రారంభించిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.
చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో నిబంధనలను ఉల్లఘించి వ్యవహరించిన ఐపీఎస్ లపై నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.