సదస్సులను నిర్వహించడంలోనూ.. వీడియో, టెలికాన్ఫరెన్స్‌ల నిర్వహణలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైలే వేరు. క్యాబినెట్ సమావేశాలను సుదీర్ఘంగా చేపడతారని ఉన్న పేరును నిన్న ముగిసిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులోనూ నిలబెట్టుకున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కంటే అవగాహన కల్పించడానికి ఆయన ఈ సారి అగ్ర తాంబూలాన్నిచ్చారు. ఆయన మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకునేందుకు సాధారణంగా ఎవరూ సాహసించరు. ఈ పర్యాయం పరిస్థితి మారింది. ఆయన తనయుడూ, ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే…తన అభిప్రాయాలనూ.. సూచనలు వెల్లడించారు. ఆయన శాఖలే కాక ఇతర శాఖలపై చర్చ సమయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకుని తన పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.
ఐటీ కంపెనీల ఏర్పాటుకు నగరాల పరిథిలోనే స్థలాలు కేటాయించాలని సూచించారు నారా లోకేశ్. దీనివల్ల ఉద్యోగులకు ఇబ్బందులు తగ్గుతాయనీ, ఊరికి దూరంగా స్థలాలిస్తే..రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన చెప్పిన సూచనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు మాట్లాడుతున్న సమయంలో జోక్యం చేసుకుని తాను చెప్పదలచుకున్నదీ.. సూచించుకున్న మార్పులనూ విస్పష్టంగా తెలిపారు. సదస్సు రెండ్రోజుల్లో లోకేశ్ ప్రాధాన్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేశ్‌ను అధికారులు సైతం చూస్తున్నట్లు అనిపించింది. చంద్రబాబు సైతం లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు నిశితంగా పరిశీలిస్తూ కనిపించారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి