జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణల గురించి తెలిసిందే..! అందరూ అంటున్నారు కాబట్టి, తానూ అనేస్తున్నా అంటారు. అందరూ అనుకోవడం వేరు, దాన్ని పవన్ కల్యాణ్ అనడం వేరు కదా. రెంటికీ చాలా తేడా ఉంది కదా! ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీ పనితీరుపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒక తాజా విమర్శ.. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములకు భూముల్ని ప్రభుత్వం కట్టబెడుతోందని! విజయనగరంలో పవన్ ఈ మధ్యనే మాట్లాడుతూ…. ‘శ్రీకాకుళం నుంచి ఒక వ్యక్తి భూమి కోసం అప్లై చేస్తే వారికి ఇవ్వలేదు, ఎక్కడో ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి రూ. 30 లక్షలకు ఎకరం ఇచ్చారు. వారు పదిహేను కోట్లకు అమ్ముకుంటున్నారు ఎకరం’ అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే పేరు వ్యక్తిది కాదు.. అదో అంతర్జాతీయ సంస్థ!
ఈ విమర్శలపై మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యల వీడియో షేర్ చేస్తూ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కాదని మంత్రి అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అదీ ఒక సంస్థ అని చెప్పారు. ఈ కంపెనీ ఆంధ్రాలో రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టి, 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందని వివరించారు. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఈ సంస్థకి సీయీవో శ్రీకాకుళం నివాసే అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేలా ఈ కంపెనీ ఏర్పాటు కాబోతోందని అన్నారు. స్థానిక యువతకిగానీ, స్థానిక పారిశ్రామికవేత్తలకుగానీ ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగడం లేదని లోకేష్ స్పష్టం చేశారు.
నిజానికి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ను ఒక వ్యక్తి అని పవన్ నోరుజారడంపై సోషల్ మీడియాలో సెటైర్లు బాగానే పడుతున్నాయి. మరి, పవన్ కు స్థానిక సమస్యలపై సమాచారం అందిస్తున్నది ఎవరోగానీ.. ఇలాంటి విషయాలపై మరింత స్పష్టత ఇస్తే బాగుంటుంది. తోటపల్లి రిజర్వాయరు గురించి ఇలానే నోరుజారి పనులు పూర్తి కాలేదన్నారు! కానీ, చాలా గ్రామాలకు ఈ రిజర్వాయరు నుంచి నీళ్లు వెళ్తున్నాయి. శ్రీకాకుళంలో కూడా ఇలానే.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మచ్చలేని నాయకుడిగా మంచిపేరున్న గౌతు శివాజీపై కూడా విమర్శలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైన సంగతీ తెలిసిందే. ఇలా మాట జారుడు అధికమౌతుంటే.. ఇది పవన్ అవగాహనా రాహిత్యం అనే విమర్శలు పెరుగుతాయి కదా! విమర్శలూ ఆరోపణల విషయంలో కొంత పరిశీలన, పరిశోధన, సమగ్ర సమాచార సేకరణ వంటివి చేసుకుంటే మంచిది.