ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ముందున్నవి రెండు సవాళ్లు! ఒకటీ.. ప్రత్యేక హోదా ఎందుకు రాలేదో అనేది మరోసారి ప్రజలకు స్పష్టం చేయడం! రెండోది.. ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో చంద్రబాబు కృషిని ప్రజల్లోకి ఎక్కించడం! ప్రత్యేక హోదా సాధించకపోవడం వల్ల జరిగిన ఇమేజ్ డామేజ్ ను.. ప్యాకేజీ సాధించామని చాటుకోవడం ద్వారా సరిచేసుకోవాలని ప్రయత్నించడం. ఈ క్రమంలో… కృష్ణా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించే ప్రయత్నం తనదైన శైలిలో చేశారు.
“ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎక్కడున్నాయి..? చివరి స్థానాల్లో ఉన్నాయి. భారతదేశానికి ఒక రూపాయి పెట్టుబడి వస్తే.. దాన్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంతొస్తున్నాయి..? మూడు నుంచి నాలుగు పైసలు. కానీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో.. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలోకి వచ్చింది” అని లోకేష్ చెప్పుకొచ్చారు! కవరింగ్ బాగానే ఉంది. ఈ విషయం దే తెలీదా.. అనేది అసలు ప్రశ్న. ప్రత్యేక హోదా వస్తే పైసల్లోనే పెట్టుబడి వస్తుందనీ, లక్షల కోట్లలో రాదనే విషయం రెండేళ్ల కిందటే ప్రజలకు చెప్పేసి ఉంటే, ఇప్పుడీ ఉద్యమాలే ఉండేవి కావు కదా! ఈ విషయం ముందే తెలిస్తే… పోరాడి సాధించేస్తామని ముఖ్యమంత్రితో సహా ఎంపీలందరూ ఎందుకు ప్రగల్బాలు పలికినట్టో..? ఈ విషయాన్నీ అప్పట్లో లోకేష్ వాళ్లకు చెప్పడం మరచారేమో?
ఇక, ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా లోకేష్ చాలా విషయాలు చెప్పారు. “2017కి ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఏవీ ఉండవని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. సో… మీరేం కోరతారో, ఎలా చేస్తారో మీరే చెప్పండి అని కోరారు. ఆనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రత్యేక హోదాలో ఏమైతే ఉన్నాయో అవి ప్రత్యేక ప్యాకేజీలో ఇవ్వండీ, అదే విధంగా దానికి చట్టబద్ధత ఇవ్వండని కోరిన ఏకైక వ్యక్తి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు” అని లోకేష్ చెప్పారు.
అంటే, ప్రత్యేక ప్యాకేజీని సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని లోకేష్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి చట్టబద్ధత కూడా చంద్రబాబు ఆలోచనే అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. సో… అరుణ్ జైట్లీ చెప్పారు కాబట్టి ప్రత్యేక హోదా వదులుకున్నారు, చంద్రబాబు చెప్పారు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్నమాట! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ మనం కాబట్టి, హోదా రాకపోయినా ఫర్వాలేదన్నమాట! లోకేష్ చెప్పాలనుకుంటున్నది ఇంతే కదా..!