ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అన్ని పెట్టుబడులు.. ఇన్ని పెట్టుబడులు అనే ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. లోకేష్ ఒకే అంశంపై ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదేమిటంటే ఏపీలో ఉన్న అవకాశాలను దిగ్గజ కంపెనీలకు వివరించడం. పూర్తి స్థాయి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని.. పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని వివరిస్తున్నారు.
నేరుగా వెళ్లి అడిగిన వెంటనే ఎవరూ పెట్టుబడులు పెట్టరు. దానికి తగ్గ అవకాశాలను ఆయా కంపెనీలు అన్వేషిస్తాయి. తమకు ఇండియాలో పెట్టుబడులు పెట్టే లేదా తమ వ్యాపారాలను విస్తరించే అవకాశాలు ఉన్నాయా… ఉంటే ఆ ప్రణాళికల్లో ఎక్కడెక్కడ అనే ప్రాధాన్యల క్రమం ఉంటే అందులో ఏపీని పెట్టుకుంటారు. టెస్లా హెడ్ క్వార్టర్ కు వెళ్లిన లోకేష్ ఏపీ గురించి… అక్కడ ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. టెస్లా ఇండియాలో పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఉంది. కానీ ఇప్పటికి ప్లేస్ ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఏపీ ఇచ్చిన ఆఫర్లను కూడా పరిగణనలలోకి తీసుకుంటుంది.
అలాగే మైక్రోసాఫ్ట్ అయినా.. యాపిల్ అయినా. ఓ రకంగా చంద్రబాబు సాఫ్ట్ వేర్ రంగం మొదట్లో విస్తరించేందుకు అమెరికా వెళ్లి ఎలా కష్టపడ్డారో నారా లోకేష్ అలాగే కష్టపడుతున్నారని అనుకోవచ్చు. అవకాశం ఉన్నప్రతి కంపెనీలో.. సమావేశంలో ఏపీని సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్నారు నారా లోకేష్. ప్రయత్నించిన ప్రతి పెట్టుబడి ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు. కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇవాళ కాకపోతే రేపైనా అది వారి దృష్టిలో ఉంటుంది. ఇది ఏపీకి దీర్ఘకాలంలో మేలు చేసే ప్రయత్నం.
నారా లోకేష్‌కు పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రత్యేకమైన రికార్డు ఉంది. మొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తెచ్చి తిరుపతి చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ హబ్ చేశారు. విజయవాడలో హెచ్‌సీఎల్ ఆయన కృషితోనే వచ్చింది. ఇప్పుడు మరింత ఉత్సాహంతో మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడుల కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.