“కేంద్రమంత్రి సుజనా చౌదరి స్థానంలో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ని రాజ్యసభకి పంపించి కేంద్రమంత్రిగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. తెదేపా నేతలు కూడా చిన్న బాబును డిల్లీ పంపాలని పెద్దబాబుపై ఒత్తిడి తెస్తున్నారు” అని ఆ మధ్యన మీడియాలో ఒకటే ప్రచారం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లోనే నెగ్గుకురాలేనివాడు ఇక డిల్లీలో ఏమి నెగ్గుకు రాగలడు? అనే ప్రశ్నలు కూడా మీడియాలో వినిపించాయి. సుజానా చౌదరిని పక్కనపెట్టి నారా లోకేష్ ని డిల్లీ పంపే సాహసం చేయగలరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యేయి. కారణాలు ఏవయితేనేమి, ఇప్పుడు ఆ ఊహాగానాలు వినిపించడం లేదు.
నారా లోకేష్ స్వయంగా తను డిల్లీ వెళ్ళాలనుకోవడం లేదని స్పష్టం చేసేసారు. తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా పని ఉందని కనుక ఇప్పట్లో డిల్లీ వెళ్ళే ఆలోచన ఏదీ లేదని మీడియాకు చెప్పారు. అంటే సుజనా చౌదరి రాజ్యసభ సీట్ సేఫ్ అనుకోవచ్చునేమో? అయితే ఆయన డిల్లీ వెళ్ళకపోతే రాష్ట్రంలో ఏమి చేస్తారనే సందేహం కలగడం సహజం. గ్రేటర్ ఎన్నికలలో కె.టి.ఆర్.చేతిలో ఘోర పరాభవం పొందిన తరువాత అయన ఏదో విధంగా తన శక్తి సామర్ధ్యాలను ప్రజలకు, స్వంత పార్టీ నేతలకు కూడా నిరూపించి చూపించుకోవలసి వస్తోంది. బహుశః అందుకే ఆయన నేరుగా కడప కంచు కోటలోకి జొరబడి వైకాపాని దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లున్నారు. ప్రస్తుతం ఆయన వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి రప్పించే పనితో తీరిక లేకుండా ఉన్నారు. కానీ ఆ పని అయిపోయిన తరువాత ఏమి చేస్తారో?