కేంద్ర మంత్రులతో సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ తో సమావేశం అయ్యారు. ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ను కేంద్రం పెట్టాలని అనుకుంటోంది. అది విశాఖలో పెట్టాలని కోరారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరిపారు. బుధవారం కూడా నారా లోకేష్ డిల్లీలోనే ఉన్నారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.
రాష్ట్రానికి సంబంధించి లోకేష్ .. ఢిల్లీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇతర విషయాలపై లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు.కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనలో రాజకీయాల చర్చలు కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఓ ప్రత్యేకమైన ఎజెండాతో ఢిల్లీకి వెళ్తారని.. అదేమిటో బయటకు రాదని టీడీపీ వర్గాలంటున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేంద్ర స్థాయిలో చర్యలు ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.
ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. తనను కలవకపోవడంపై సరదాగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా వచ్చి కలవాలన్నారు. త్వరలోనే వచ్చి కలుస్తానని లోకేష్ చెప్పారు. ప్రధాని మోదీ బిజీగా లేని సందర్భం చూసుకుని ఆయనతో లోకేష్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు , పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్నందున… ఈ సారి ప్రధానితో భేటీ అయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు.