భాజపా, వైకాపా నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… ఇష్టానుసారంగా భూముల్ని ఐటీ కంపెనీలకు కట్టబెడుతున్నానని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారనీ, అవి అర్థంపర్థం లేని మాటలని కొట్టిపారేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి తెలియనివారు కూడా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆంధ్రాలో ఇంక్యుబేషన్ సెంటర్ పెడతామని వాళ్లు ముందుకొచ్చి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారని చెప్పారు. ఆ కంపెనీ 100 ఎకరాలు భూమి అడిగితే, 40 ఎకరాలకు ఒప్పించి తీసుకొచ్చామన్నారు. ఐటీ శాఖమంత్రిగా 50 ఎకరాలకు మించి ఏ కంపెనీకి భూములివ్వలేదన్నారు. ఏపీకి వస్తున్న కంపెనీలకు ముందుగా అద్దెకు స్థలం ఇస్తామనీ, ఏడాదిపాటు కంపెనీని విజయవంతంగా నడిపిస్తే ఆ తరువాత భూములు ఇస్తామంటూ కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు.
వైకాపా వాళ్లు రూ. 20 వేల కోట్ల కుంభకోణమైందని ప్రచారం చేస్తున్నారనీ, అన్ని భూములు మనకు ఎక్కడున్నాయని లోకేష్ ప్రశ్నించారు. ఆరోపణలు చేసేవారు వాస్తవాలు తెలుసుకోవాలనీ, ఆధారాలుంటే మీడియా ముందు నిలబెట్టాలని మంత్రి సవాల్ చేశారు. తనపై కొంతమంది వ్యక్తిగత ఆరోపణలు చేశారనీ, మూడు నెలల కిందటే తాను సవాలు విసిరాననీ, ఆధారాలు చూపించాలని ఛాలెంజ్ చేస్తే ఒక్కరూ స్పందించడం లేదని మంత్రి లోకేష్ అన్నారు. తాను ఇప్పటికీ రోజూ వెయిట్ చేస్తున్నాననీ, ఆధారాలు చూపిస్తే తాను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోవచ్చు కదా అని ఎదురుచూస్తున్నా అన్నారు! కానీ, ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలానే ఆరోపణలు చేశారనీ, ప్రతిపక్షాల మాటల వింటూ కూర్చుంటే హైదరాబాద్ కి ఒక్క ఐటీ కంపెనీ కూడా వచ్చుండేది కాదన్నారు. ఆనాడు హైదరాబాద్ మాదిరిగానే, ఇప్పుడు అమరావతిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని సీఎం అభివృద్ధి చేస్తున్నారని మంత్రి లోకేష్ చెప్పారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ మీద ప్రతిపక్ష పార్టీ వైకాపాతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. కొత్తగా భాజపా నేతలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రాలో అవినీతి అవినీతి అంటూ రోజూ వల్లిస్తుంటారు. కానీ, ఏ ఒక్కరూ ఆధారాలు చూపరు. జన్మభూమి కమిటీల దగ్గర్నుంచీ ప్రాజెక్టుల వరకూ అంతా అవినీతే అని జగన్ అంటారు. కానీ, ఒక్క ఆధారమూ చూపించరు! తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అవినీతికి చంద్రబాబు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అంటారు. మరి, రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుంటే… వారు అధికారంలోకి వచ్చే వరకూ ఆగాలంటే ఎలా..? ఇక, పవన్ ఆరోపణలంటే… అందరూ అంటున్నారు కాబట్టి తానూ అనేస్తా అని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. మరి, మంత్రి లోకేష్ తాజా స్పందనపై ఎవరైనా ప్రతిస్పందిస్తారేమో చూడాలి.