లాక్డౌన్ కారణంగా నష్టపోయిన రోజుకూలీలు, చిరు వ్యాపారులను ఆదుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ రోజుకో లేఖ రాస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాస్తున్న లేఖల్లో… రోజుకో వర్గం.. కష్టాలను హైలెట్ చేస్తున్నారు. శనివారం ఆయన భవన నిర్మాణ కార్మికుల సమస్యలను గుర్తు చేస్తూ.. వారందరికీ తక్షణ సాయంగా రూ. పదివేలు ఇవ్వాలంటూ.. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ..ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు రావడం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని లోకేష్ తన లేఖలో గుర్తు చేశారు. వారి సంక్షేమం కోసం ఇంత కాలం వసూలు చేసిన రూ. 1900కోట్ల బిల్డింగ్ సెస్ ప్రభుత్వం వద్ద ఉందన్నారు.
శుక్రవారం.. చేనేతల కష్టాలను హైలెట్ చేస్తూ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది చేనేత కుటుంబాలతోపాటు, 81 వేల పవర్లూమ్ కార్మికులపైనా లాక్డౌన్ ప్రభావం పడిందని, వారి జీవన విధానం దెబ్బతినడమే కాకుండా తయారు చేసిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునే అవకాశమూ లేకుండా పోయిందని పేర్కొన్నారు. నేతన్నల వద్ద తయారై సిద్ధంగా ఉన్న నిల్వలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క చేనేత కార్మికునికి రూ. 15వేలు తక్షణ సాయం చేయాలని కోరారు. గురువారం రోజు.. స్వర్ణకారులను ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ను లేఖలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులకు ఆర్ధిక ప్యాకేజి ప్రకటించాలని నారా లోకేష్ లేఖలో విజ్ఞప్తి చేశారు. దాదాపు 1.5లక్షల మంది ఇబ్బందుల్లో ఉన్నారని లేఖలో నారా లోకేష్ ప్రస్తావించారు.
నెల రోజుల నుంచిలాక్ డౌన్ ఉంది. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడంతో… బడుగు, బలహీన వర్గాలు..కుల వృత్తులు చేసుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం.. రూ. వెయ్యి మాత్రమే సాయం చేసింది.కనీసం ఐదు వేలు అందరికీ సాయం చేయాలని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోకేష్ ఇప్పుడు.. వర్గాల వారీగా సాయం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసి..ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.