నారా లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు. ఈ మేరకు మంగళవారం టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తూ రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ ప్రాతినిధ్యం వహించాలనుకున్నారు. ఎంమ్మెల్సీగా ఎన్నికై , ఆ తర్వాత మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదటగా గుంటూరుజిల్లా పెదకూరపాడు, మంగళగిరి నియోజకవర్గాలతో పాటు విశాఖపట్నంలోని భీమిలీ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలను పరిశీలించారు. తొలుత భీమిలి నుంచి పోటీ చేసేందుకు లోకేషే ఆసక్తిని కనబరచడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా తాను తప్పుకునేందుకు సిద్దమని ప్రకటించారు. ఇప్పుడు లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఉత్తర నియోజకవర్గం 2014 ఎన్నికలలో బీజేపీతో పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజుకు కేటాయించారు. ఆయన గెలుపొందారు. తెలుగుదేశంతో పొత్తులు తెగతెంపులు కావడంతో ఉత్తర నియోజకవర్గం ఖాళీగా ఉంది. హుద్ హుద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ది చేయడం, ఐటీకి కూడా విశాఖపట్నాన్ని హబ్ గా మార్చడంతో విశాఖ ఎపీలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంగా మారుతుంది. అందువల్లే లోకేష్ ను అక్కడి నుంచి పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 2009లో ఏర్పటయింది. టీడీపీకి బలమైన నేతలు ఎవరూ లేకపోవడంతో..మూడో స్థానంలో ఉండాల్సి వచ్చింది. రెండో స్థానంలో పీఆర్పీ ఉంది.
గంటా ఈసారి విశాఖపట్నం లేదా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. నారా లోకేష్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తుండటంతో ఆ జిల్లా నేతలను, నార్త్ నియోజకవర్గ నేతలందరినీ కూడా చంద్రబాబు పిలిపిస్తున్నట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావుతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. బుధవారంతో విశాఖ నార్త్, భీమిలీ, విశాఖ, అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్ధులపై సీఎం నిర్ణయానికి రానున్నారు. మొత్తానికి.. టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గం నుంచి లోకేష్ బరిలోకి దిగాలని నిర్ణయించుకుని.. ఓ రకమైన డేరింగ్ నెస్ చూపిస్తున్నారని అనుకోవాలి.