ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడిని తెదేపా కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చేరు కానీ దాని వలన ‘లోకేష్ రాజకీయ గ్రాఫ్’లో ఏమాత్రం మార్పు కనబడలేదు. కనబడలేదు అనే కంటే కనిపించేందుకు ఆయన గట్టి ప్రయత్నాలేవీ చేయలేదని చెప్పకతప్పదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని సవాలుగా తీసుకొని పని చేసినప్పటికీ, ఎదురుదెబ్బ తగలడంతో లోకేష్ స్టేటస్ గ్రాఫ్ పడిపోయింది. దానిని మళ్ళీ పైకి లేవనెత్తాలంటే ఒకటే మార్గం..మంత్రి పదవి కట్టబెట్టడమేనని తెదేపా నేతలు, ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రతీ విషయంలో అనుకరించడానికి తెదేపా చేతిలో ‘తెలంగాణా ఫార్మాట్’ ఒకటి సిద్దంగా ఉంది కనుక దాని ప్రకారం చూసుకొంటే అక్కడ కె.టి.ఆర్.కి మంత్రి పదవి ఇచ్చేరు కనుక ఇక్కడ లోకేష్ కి కూడా ఇవ్వడం సముచితమే అవుతుంది. మిగిలిన ఈ మూడేళ్ళలో తండ్రి మరియు శ్రేయోభిలాషుల రక్షణ, మార్గదర్శకత్వంలో లోకేష్ తన సమర్ధతను పరీక్షించి చూసుకోవచ్చును. ఒకవేళ అందులో నెగ్గితే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. లేకుంటే…రాజకీయ భవిష్యత్ ఉండదు గనుక ‘లేకుంటే…’అనే ఆలోచనే చేయడానికే వీలులేదు. అవకాశం వచ్చినప్పుడు చొరవ తీసుకోకుంటే ఏమవుతుందో తెలుసుకోవడానికి రాహుల్ గాంధి ఒక మంచి ఉదాహరణగా కళ్ళెదుటే ఉన్నారు. లోకేష్ కి పిల్లనిచ్చిన మావగారు నందమూరి బాలకృష్ణకి ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తి ఉందని తెలుసు. అంత పెద్ద ఆశను నెరవేర్చాలంటే పెద్దబాబు, చిన్నబాబుగారు ఇద్దరూ కూడా ఇబ్బందిపడవలసి ఉంటుంది కనుక ప్రస్తుతానికి ఏదో ఒక మంత్రి పదవి కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు. కానీ వచ్చిన చిక్కంతా కులాలు, బలాలు, ప్రాంతాల లెక్కలతోనే! అయితే అవేవీ లోకేష్ కి మంత్రి పదవి కట్టబెట్టడానికి అడ్డం కాబోవని ఖచ్చితంగా చెప్పవచ్చును. బాలకృష్ణ విషయంలోనే వాటిన్నిటినీ కొంచెం ఎడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దసరాలోగా ఈ లెక్కలు పూర్తి చేసి పండుగ రోజునే చిన్నబాబుకి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించే అవకాశం ఉందని తాజా సమాచారం.