తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు గురించి మూన్నాళ్లకు ఒక్కో ముచ్చట వార్తల్లోకి వస్తూ ఉంటుంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ఒక రాజకీయ శక్తిగా ఎదిగాడనే పేరును తెచ్చుకున్నాడు. అలాగే భవిష్యత్తు ఏపీకి సీఎం అని లోకేష్ విషయంలో సొంత పార్టీ వారు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేష్ ఈ టర్మ్ లోనే మంత్రి పదవిని అధిష్టించనున్నాడని గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే అది కేంద్ర మంత్రి పదవి అని కొన్ని రోజులు కాదు రాష్ట్ర మంత్రి అవుతాడని మరి కొన్ని రోజులూ ప్రచారం చేస్తున్నారు.
ఈ మధ్యనే తెలుగుదేశంవాళ్లు కొత్త మాట చెప్పారు. లోకేష్ ఢిల్లీ వెళతాడని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తాడని తమ్ముళ్లు చెప్పారు. అయితే ఇంతలోనే టోన్ మారింది. తెలుగుదేశం వైపు నుంచి ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లడం కాదు.. బాబు కేబినెట్ లో లోకేష్ మంత్రి కాబోతున్నాడని అంటున్నారు. సెప్టెంబర్ లో ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని..అప్పుడు లోకేష్ ఒక కీలకమైన శాఖకు మంత్రి గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.
మరి లోకేష్ కు దక్కుతాయనే పదవులు విషయంలో ఇలా వరసగా ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రచారం చేయడం ఒకింత విశేషమైన అంశమే. కేంద్రమంత్రి అని, ఢిల్లీలో ప్రభుత్వ కార్యదర్శి అని, రాష్ట్రంలో మంత్రి పదవి అని ఇలా చెబుతూ పోతే లోకేష్ ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాడేమో అనుకోవాల్సి వస్తుంది. అయినా తెలుగుదేశం అధినేత తనయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటి ఎంట్రీ ఇస్తే బాగుటుంది కానీ, మరీ ఇలా మంత్రి పదవిని తీసుకుని దాన్ని నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్సీగా ఎన్నికయితే అదంత గ్రాండ్ ఎంట్రీ అనిపించుకోదేమో!