తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర నేడు కడప జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మూడు రాయలసీమ జిల్లాల్లో యాత్ర పూర్తవుతుంది. ఒక్కో జిల్లాలో నెల రోజులకుపైగా సమయం కేటాయించి..దాదాపుగా అన్ని కీలక నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. సాగుతున్న పాదయాత్రకు అంతకంతకూ జనాదరణ పెరుగుతోంది. కుప్పంలో ప్రారంభమైన యాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించినా చివరికి .. టేబుల్ మీద ఎక్కి మైక్ లేకుండా మాట్లాడాల్సి వచ్చినా గొంతు నొప్పిని భరిస్తూ.. పాదయాత్ర చేస్తున్నారు.
అదిరిపోతున్న ఎండలు కూడా లోకేష్ సంకల్పాన్ని తగ్గించలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు.. ప్రతి వారం ఐదు రోజులు చేసేవారు. అది కూడా ఐదో రోజు మధ్యాహానికి హైదరాబాద్ బయలుదేరి.. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. ఆ తర్వాతి రోజు రెస్ట్ . చీటికి మాటికి అనేక సార్లు విశ్రాంతి తీసుకున్నారు. అయితే లోకేష్ మాత్రం ఆదివారాలు కూడా ఆగడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పాదయాత్ర షెడ్యూల్ తీరిక లేకుండా ఉంటుంది.
కడప జిల్లా టీడీపీ క్యాడర్ లోనూ జోష్ కనిపిస్తోంది. పులివెందులలో ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు టీడీపీకే ఆధిక్యం ఇచ్చారు. మూడు జిల్లాల పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. పులివెందుల నుంచి సైతం ఇద్దరు బలమైన నేతలు ఉండటంతో.. టీడీపీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. పులివెందుల పూల అంగళ్ల సెంటర్లో టీడీపీ సంబరాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. పులివెందుల నియోజకకర్గం మీద నుంచే పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.