టీడపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణానాలపై నారా లోకేష్ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలు, పార్టీల నేతలకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని టీడీపీ నేతలు అభిప్రాయ పడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని ఖండించారు. అలాగే ఈ టెలీకాన్ఫరెన్స్ లో లోకేష్ యువగళం పున: ప్రారంభంపై కూడా చర్చించారు. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అలాగే నారా లోకేష్ చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు న్యాయ వాదులతో చర్చిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూనే.. ఇటు యువగళంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింత గా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని టెలీకాన్ఫరెన్సులో నేతలంతా నిర్ణయించుకున్నారు.
మరో వైపు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం తెలుగు దేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిమాయకమైంది. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ సహా మొత్తం 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించారు.