నారా లోకేష్..ఇప్పుడు వారసుడు కాదు తనను తాను నిరూపించుకున్న రాజకీయ నాయకుడు. ఇంకా చెప్పాలంటే వారసుడు అన్న మైనస్ ను సమర్థంగా తొలగించుకుని తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న నేత. ఐదేళ్ల కిందట టీడీపీ ఓడిపోయినప్పుడు .. పార్టీకి ఆయనే భారం అన్నారు. ఈ రోజు నారా లోకేష్ వల్లే టీడీపీ గెలిచిందంటున్నారు. ఐదేళ్లలో వచ్చిన మార్పు.. లోకేష్ తెచ్చిన మార్పు ఇదే.
రాజకీయాల్లోకి రాక ముందే లోకేష్ టార్గెట్
ఓ ముఖ్యమంత్రి మనవడు.. మరో ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ జీవితంలో అత్యధిక కాలం సీఎం కుటుంబసభ్యునిగానే గడిచింది. అయితే అలా గోల్డెన్ స్పూన్‌తో పుట్టడమే లోకేష్‌కు మైనస్ అయింది. ఆయనను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే టార్గెట్ చేశారు. తనను.. తను ఇమేజ్ ను ప్రజల్లో ప్రణాళిక ప్రకారం పలుచన చేస్తున్నారని తెలుసుకునే సరికి లోకేష్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ పడినా లేచే కెరటం మాదిరి ఆయన తన ప్రయత్నాలను విరమించలేదు.
రాజకీయాల్లో రాక ముందు నుంచే నారా లోకేష్ టార్గెట్‌గా రాజకీయం
నారా లోకేష్‌కు ఈ విజయం వారసత్వంగా రాలేదు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొన్నారు. తను రాజకీయాల్లోకి వస్తాడో రాడో తేలియని సమయం నుంచే ఆయనపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు. స్టాన్ ఫర్డ్‌లో చదువుకోవడం చేతకానితనమన్నట్లుగా చెప్పారు. నీట్ షేవ్‌తో ఉండటం .. పద్దతిగా మాట్లాడటం పప్పునకు బ్రాండ్ అన్నారు. చివరికి బాడీ షేమింగ్ చేశారు. మరో నేత అయితే ఈ మానసిక దాడికి భయపడిపోయేవారు. అలాంటి సంక్షోభాన్నీ అవకాశంగా మల్చుకోవాలని డిసైడయ్యారు. దేనికైనా వెరువని తత్వం తనదని నిరూపించుకున్నారు.
తండ్రి మాటను అక్షరాలా పాటించిన నారా లోకేష్
సంక్షోభాల్లో అవకాశాల్ని అంది పుచ్చుకోవాలని చెబుతూంటారు చంద్రబాబునాయుడు. నారా లోకేష్ ఖచ్చితంగా అదే చేసి చూపించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం తెలుగుదేశం పార్టీకి ఓ సంక్షోభం. ఆ సంక్షోభంలో అవకాశాల్ని వెదుక్కున్నారు నారా లోకేష్. 2019లో మంత్రిగా ఉన్నా ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది. సోషల్ మీడియాలోను ఆయనను ట్రోల్ చేయని వారు లేరు. అంత ఘోరమైన ఓటమిని చవి చూసినా నారా లోకేష్ కుంగిపోలేదు. ప్రణాళికాబద్దంగా తనను తాను బిల్డ్ చేసుకున్నారు తన ఇమేజ్ మార్చుకున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడ్నని నమ్మకం కలిగించారు. లోకేష్ తన నాయకత్వ సామర్థ్యాన్ని ఓటమి నుంచి వచ్చిన అవకాశంతో నిరూపించుకున్నారు.
డీబీటీ పథకాల ఆలోచన నారా లోకేష్‌దే
డీబీటీ అంటే నగదు బదిలీ అనే ఆలోచన నారా లోకేష్‌ది. టీడీపీలో ఉన్నప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే టీడీపీ పాలసీల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. 2009లో టీడీపీ నగదు బదిలీ హామీని ఇచ్చింది. మేనిఫెస్టోలో పెట్టి విస్తృతంగా ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది ఆ పథకం. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం, లోక్‌సత్తా వంటి పార్టీలు అధికార వ్యతిరేకత ఓట్లు చీల్చడంతో టీడీపీ విజయం దాకా చేరలేకపోయింది.
కార్యకర్తల సంక్షేమంలో నారా లోకేష్ ముద్ర
అదే సమయమంలో పార్టీ కార్యకర్తల కోసం నారా లోకేష్ ముందు నుంచీ ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కల్పించిన మొట్టమొదటి పార్టీ టీడీపీ. ఈ ఆలోచనను వర్కవుట్ చేసింది లోకేష్. ఇప్పుడు ప్రతీ పార్టీ తమ సభ్యులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయంటే.. దానికి పెటేంట్ నారా లోకేష్‌దే అుకోవచ్చు. ఆయనపై ఎప్పుడూ తప్పు చేశారన్న ఆరోపణలు రాలేదు. గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నా లేకపోయినా తండ్రి, తాతల పేర్లు మాత్రం చెడగొట్టనని ఆయన ధీమాగా చెబుతూంటారు. కానీ తాతలోని ముక్కుసూటితనం, తండ్రిలోని పనితనం కలిసి వారిద్దరినీ మించిన నాయకుడు అవుతారన్న నమ్మకాన్ని పార్టీలో కల్పించారు.