మంత్రి నారా లోకేష్ మళ్లీ ఫైర్ అయ్యారు! ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ప్రారంభించిన తరువాత టీడీపీ ప్రముఖ నేతలంతా ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేశారు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా జగన్ మీదా, వైకాపా నేతల మీదా మండిపడ్డారు. రొటీన్ గా కాకుండా కొన్ని పంచ్ లు కూడా వేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా ఉందన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏపీకి వచ్చాయనీ, మరిన్ని రాబోతున్నాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మనం ఈ రకంగా నంబర్ వన్ అయితే… వైయస్ హాయంలో జగన్ ప్రోత్సాహంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో నంబర్ వన్ అయ్యామంటూ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబుకీ, వైయస్ కీ పోలిక లేదన్నారు. రాష్ట్రానికి చాలా పరిశ్రమలు వచ్చాయనీ, ఇంకా వస్తున్నాయనీ, ఐటీలో ఇంతవరకూ పదమూడు వేల ఉద్యోగాలు వచ్చాయనీ, కావాలంటే కంపెనీలవారీగా లెక్కలతో సహా చెప్తానని మంత్రి అన్నారు. ఆంధ్రాకు వస్తున్న కంపెనీలవారు చంద్రబాబు నాయుడు నాయకత్వం చూసి ఒప్పందాలపై సంతకాలు పెడతారా, లేదంటే ఒక ఆర్థిక నేరస్థుడిని చూసి పెట్టుబడులు పెడతారా అనేది ప్రజలకే తెలుసు అని చెప్పారు. జగన్ కు ఆరోపణలు చేయడం తప్ప వేరే ఏం పనుందని ప్రశ్నించారు. ప్యారడైజ్ పేపర్లలో ఎవరి పేరుందన్నారు. ఎ 1 ఎవరంటే.. వైయస్సార్ సీపీ అధ్యక్షుడు ఉన్నారనీ, ఎ 2 గా ఉన్నది వైయస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ, బొత్సపై సీబీఐ కేసుంది, సునిల్ అనే ఒక ఎమ్మెల్యేపై కూడా సీబీఐ కేసు… ఇలా వైకాపా నేతలందరికీ కేసులు ఉండటం అనేది ప్రీ క్వాలిఫికేషన్ అంటూ ఎద్దేవా చేశారు. వైకాపాలో సభ్యత్వం తీసుకుని చేరాలనుకుంటే, సీబీఐ కేసు ఉండటం తప్పనిసరి అంటూ వ్యంగ్యంగా అన్నారు. ప్యారడైజ్ పేపర్లలో తమ పేర్లు లేవనీ, ఇతర కేసుల్లో ఎ1, ఎ2గా మేం లేవని లోకేష్ చెప్పారు!
పాదయాత్ర నేపథ్యంలో ప్యారడైజ్ పేపర్లు బయటకి రావడం, వాటిలో జగన్ పేరు ప్రస్థావన ఉండటాన్ని టీడీపీ బాగానే వాడుకుంటోంది. గత ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో కూడా ‘జగన్ అవినీతి’ అంశాన్నే టీడీపీ ప్రధానాస్త్రంగా మార్చుకుంటుందని అర్థమౌతూనే ఉంది. జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనే విమర్శ బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్తగా, ప్రపంచంలో ఎక్కడ ఏ అవినీతిమంతుల జాబితా బయటకి వచ్చినా జగన్ పేరు ఉంటోందని ఆరోపిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమనే అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ కేసుల అంశమై జగన్ ఎదుర్కొంటున్న విమర్శలకు వైకాపా నుంచి సమర్థవంతమైన సమాధానం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు!