వైసీపీ ఎమ్మెల్యే చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి పదకొండు నిమిషాల్లో జంప్ అయిపోయిన వారు తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలు మెగా డీఎస్సీ మీద ప్రశ్న వేశారు. విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మెగా డీఎస్సీపై ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వచ్చినపుడూ ఎవరు సభలో లేరు. స్పీకర్ చైర్ లో ఉన్న రఘురామకృష్ణరాజు వారెవరూ రాకపోవడం కనీసం టీవీలో అయినా చూసుకుంటారని సెటైర్ వేశారు. ఈ ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.
అసెంబ్లీని బహిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా దాగుడుమూతలు ఆడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రశ్న అడిగినప్పుడు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఉంటే బాగుండేది. కానీ వచ్చే ఉద్దేశం లేనప్పుడు ప్రశ్నలు ఎందుకు అడిగారన్నది అర్థం కాని విషయం. రేపు ఎప్పుడైనా అనర్హతా వేటు అంశం చర్చకు వస్తే.. తాము అసెంబ్లీ సమావేశాల్లో యాక్టివ్ గా ఉన్నామని చెప్పుకునేందుకు ఈ ప్రశ్నలు అడిగి ఉంటారని భావిస్తున్నారు.
ఇంత మాత్రం దానికి అసెంబ్లీని బహిష్కరించడం దేనికని…. నేరుగా సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ సభ్యులకు జగన్ ఏం చెబితే అదే చేయాలి. జగన్ కు తప్ప అందరికీ అసెంబ్లీకి వెళ్లారని ఉందని.. కానీ జగన్ కు ఇష్టం లేకనే వెళ్లడం లేదని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్నలు పంపుతారు.. కొన్ని రోజుల్లో జగన్ లో మార్పు రాకపోతే నేరుగా అసెంబ్లీకి హాజరవుతారని .. భావిస్తున్నారు.