టీడీపీ సభ్యత్వం తీసుకోవాలనుకునేవారి.. వాట్సాప్లో రెండు మెసెజులతో కార్డు కూడా వచ్చే సదుపాయాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. ఇలా కూడా చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరోసారి పార్టీ కార్యకర్తలందర్నీ లోకేష్ ఆశ్చర్య పరుస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ.. వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. అది కూడా లోకేష్ వ్యక్తిగత నెంబర్ నుంచి.
డియర్ సుందరం మీరు ప్రభుత్వ నిర్బంధాల్ని ఎదుర్కొని పోరాడుతున్న వైనం అద్భుతంగా ఉంది. నేను మీకు అండగా ఉంటాను అని నారా లోకేష్ నుంచి పర్సనల్ వాట్సాప్ నెంబర్ నుంచి మెసెజ్ వస్తే.. సగటు టీడీపీ కార్యకర్తలకు ఎలా ఉంటుంది. గాల్లో ఎగురుతున్నట్లే ఉంటుంది. ఇలాంటి అనుభూతి చాలా మంది టీడీపీ కార్యకర్తలకు కలిగింది. ఎందుకంటే నారా లోకేష్ ఇలా వందల మంది టీడీపీ కార్యకర్తలకు మెసెజ్ చేశారు. అంత తీరిక ఆయనకు ఉందా .. ఇదంతా చాట్ బోట్ ద్వారా చేస్తున్నారని కొంత మంది అనుకున్నారు. ఎవరేమనుకున్నా.. తమను గుర్తించారన్న ఓ ఆనందం మాత్రం కార్యకర్తలకు కలిగింది.
ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ కోసం స్వచ్చందంగా పని చేసే కార్యకర్తల లోకేష్ ప్రత్యేకంగా కలిశారు. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందరితో సమావేశం పెట్టి ప్రసంగించి వెళ్లడం లాంటి పనులు చేయకుండా ఒక్కొక్కరితో సమావేశం అయ్యారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చి పంపించారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరితం ఉత్సాహంగా పని చేస్తున్నారు. లోకేష్ పార్టీలోని యువశక్తిని యాక్టివేట్ చేస్తున్నారని .. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం
టీడీపీలో వినిపిస్తోంది. ఎలా చేసినా.. లోకేష్ దృష్టిలో తామున్నామన్న నమ్మకంతో కార్యక్రతలు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు.