జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టు వివాదం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రత్యేకించి గోదావరి జిల్లాలలో ఈ టాపిక్ మీద బాగా చర్చ జరుగుతుంది. రాపాక వరప్రసాద్ పోలీసులు అరెస్టు చేసిన తన అనుచరుల కోసం స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడి ఎస్సై ఆయన మీద దుర్భాషలాడటం, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం చేశాడని, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ అరెస్టు కోసం కుట్రపూరితంగా ప్రయత్నించారని జనసేన అభిమానులు అంటున్నారు. అయితే కోర్టు పోలీసుల కి మొట్టికాయలు వేసి చీవాట్లు పెట్టడం తో, పోలీసులు చేసేదేమీ లేక స్టేషన్ బెయిల్ పైన ఆయనను విడిచి పెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత మరియు మాజీ మంత్రి నారా లోకేష్- జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుపై స్పందించారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణిలో వెళ్తోందని, దౌర్జన్యం చేస్తోందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ట్వీట్ చేస్తూ, “ఒక పత్రికా విలేఖరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం… మలికిపురం ఘటనలో ప్రజల తరపున ప్రశ్నించినంత మాత్రాన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని అరెస్టు చేసింది. అంటే ఏమిటి? అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం? ” అంటూ నిలదీశారు.
ఏదిఏమైనా, జనసేన ఎమ్మెల్యే అరెస్టు వివాదం అధికార వైఎస్సార్సీపీకి అనవసరమైన తలనొప్పి తెచ్చిపెట్టింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలపై దాడి చేస్తున్నా, జర్నలిస్టులపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు కానీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల మీద మాత్రం అనవసరమైన దూకుడు ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ఒక రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి.