ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి వరుస ట్వీట్లతో విమర్శలకు దిగారు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్. అయ్యా… తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ అంటూ మొదలుపెట్టి… ఎడమ కాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కట్టు కట్టించినట్టుగా ఉంది మీ తెలివి అన్నారు. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదిరెట్లు పెంచిన మీ లాజిక్, రివర్స్ టెండరింగ్ లోపలున్న అసలైన మేజిక్ ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్టు చేస్తోందని విమర్శించారు. పోలవరం బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అనీ, దాన్ని కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి అనుభవం లేని కంపెనీకి అప్పగించడం సరైంది కాదన్నారు. అది ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు మీదికి చైనా మేఘాలు కమ్ముకుంటున్నాయన్నారు.
మరో ట్వీట్లో లోకేష్ స్పందిస్తూ… ప్రకాశం బేరేజీకి అడ్డంగా పడున్న ఒక బోటును తీసేందుకు మీకు ఓ వారం రోజులు పట్టిందనీ, గోదావరిలో బోటు మునిగితే రెండు వారాలైనా తీయలేకపోయారనీ, సెక్షన్ 144 పెట్టారన్నారు. 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని, 30 శాతం పూర్తి చేస్తామంటూ సవాలు చేయడం మంత్రిగారికి అలవాటైన విద్యేమో, అందుకే పోలవరం మీద కూడా బెట్టింగులు కాద్దామంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఓ మూడురోజుల కిందట.. ఇప్పటికైనా నోరు తెరవండి ముఖ్యమంత్రిగారూ అంటూ గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నేరుగా స్పందించారు. ఇప్పుడు ఏకంగా తుగ్లక్ సీఎం అంటూ ఆరోపిస్తున్నారు నారా లోకేష్.
ప్రతిపక్ష పార్టీగా టీడీపీ తరఫున ధీటైన ప్రశ్నలూ విమర్శలే నారా లోకేష్ చేస్తున్నా… వీటిపై అధికార పార్టీ నుంచి స్పష్టమైన స్పందన ఉండటం లేదు. ఇప్పుడీ పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలోగానీ, గోదావరిలో బోటు ప్రమాదం అంశంలోగానీ, గ్రామ సచివాలయ పేపర్ల లీకేజీ వ్యవహారంలోగానీ… ప్రభుత్వం నుంచి ప్రజలకు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే, అనుమానాలు అలానే వదిలేసి, తాము చేస్తున్న ప్రక్రియే గొప్పదీ అనుసరిస్తున్న విధానాలే అద్భుతమైనవీ అనే ధోరణిలో మంత్రులు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న విమర్శలూ ఆరోపణలను కూడా అధికార పార్టీ పరిగణనలోకి తీసుకుని స్పందించాల్సి ఉంటుంది.
అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ.. ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కట్టు కట్టించినట్టుంది మీ తెలివి. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్య ప్రజలకూ అర్థమైంది.#YSJaganFailedCM
— Lokesh Nara (@naralokesh) September 25, 2019
పోలవరంలాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవంలేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం. రివర్స్ టెండరింగ్ లో భాగంగా ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు కమ్ముకొస్తున్నాయి. #YSJaganFailedCM
— Lokesh Nara (@naralokesh) September 25, 2019
ప్రకాశం బ్యారేజీ గేటుకడ్డంగా బోటు పడితే తీయడానికి మీకు వారం పట్టింది. గోదావరిలో మునిగిన బోటును రెండువారాలుగా తీయలేక, 144 సెక్షన్ పెట్టారు. 70 శాతం పూర్తయిన పోలవరం 30 శాతం పూర్తి చేస్తామని సవాల్ విసురుతున్న మంత్రిగారికి అలవాటైన విద్యేమో.. పోలవరంపైనా బెట్టింగ్ కాద్దామంటున్నారు.
— Lokesh Nara (@naralokesh) September 25, 2019