హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలుగుదేశానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు తర్వాత ఇరుపార్టీల మధ్య సంబంధాలు మరింత విషమించాయి. అయితే తెలుగుదేశం భావి అధినేతగా పరిగణించబడుతున్న నారా లోకేష్మాత్రం ఆశ్చర్యకరంగా తనకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఇరిగేషన్ శాఖమంత్రి హరీష్ రావు అంటే ఇష్టమని చెప్పారు. ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో, టీఆర్ఎస్లో ఏ నాయకుడంటే ఇష్టమని అడిగినపుడు హరీష్ రావు పేరును పేర్కొన్నారు. ఎన్నో మంచి లక్షణాలున్న హరీష్‌ను అనుసరించటానికి ఇష్టపడతానని చెప్పారు. ఆయన నిజమైన ప్రజానాయకుడని, ఎప్పుడూ ప్రజలలోనే ఉంటారని అన్నారు.
ప్రత్యర్థి పార్టీ నాయకుడైనా మంచి లక్షణాలుంటే మెచ్చుకోవటం ఒక సత్సాంప్రదాయమైనప్పటికీ, ప్రస్తుతం టీఆర్ఎస్తో నెలకొని ఉన్న సంబంధాల దృష్ట్యా అలా మెచ్చుకోవటం టీడీపీ శ్రేణులకు సరైన సంకేతాలు పంపదనే వాదనకూడా వినిపిస్తోంది. మరోవైపు వీరిద్దరిమధ్య గతంలో ట్విట్టర్ వేదికగా జరిగిన మాటల యుద్ధాన్నికూడా అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో… 2012 సంవత్సరంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అటెండర్‌గా పనిచేస్తానని హరీష్‌రావు సవాల్ విసిరారు. తదనంతర పరిణామాలలో తెలుగుదేశం కేంద్రానికి ఆ లేఖను ఇచ్చిన తర్వాత, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అటెండర్ పోస్ట్ కోసం హరీష్ దరఖాస్తుకై ఎదురుచూస్తున్నామని లోకేష్ ట్వీట్ చేశారు. అది నాడు ఇరుపార్టీలలో పెద్ద చర్చనీయాంశమయింది. ఆ విషయాన్నే ఇప్పుడు అందరూ గుర్తుకు తెచ్చుకున్నారు.