తెదేపా ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసినట్లు ఒక ప్రముఖ పత్రిక పేర్కొంది. ఒక తెరాస మంత్రి నారా లోకేష్ కి ఫోన్ చేసి “ముఖ్యమంత్రి కెసిఆర్ తనని పట్టించుకోవడం లేదు, తెరాసలో ఇమడలేకపోతున్నాను” అని ఆవేదన వ్యక్తం చేసినట్లు దానిలో పేర్కొంది. “తెదేపా నుంచి తెరాసలో రప్పించే వరకు కెసిఆర్ తనతో గంటలు గంటలు మాట్లాడేరని, తనతో కలిసి టిఫిన్ కూడా చేశారని కానీ ఇప్పుడు అసలు తనని పట్టించుకోవడం లేదని, ఆయనతో మాట్లాడే అవకాశమే కలగడం లేదని, పోనీ ఎవరితోనైనా మాట్లాడుదామంటే తనకి అంత ధైర్యం లేదని” ఆయన లోకేష్ కి మోరపెట్టుకొన్నట్లు ఆ పత్రికలో పేర్కొంది.
నారా లోకేష్, ఆ పత్రిక కూడా ఆ మంత్రి పేరు బయటపెట్టలేదు కానీ తెదేపా నుంచి తెరాసలో చేరి మంత్రులుగా అయిన వారిలో కడియం శ్రీహరి పరిస్థితే అంత బాగోకపోవడం గమనిస్తే, బహుశః ఆయనే లోకేష్ కి ఫోన్ చేసి ఉండవచ్చని అనుమానించవలసివస్తోంది.
వరంగల్ ఎంపిగా ఉన్న ఆయనని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ పదవికి రాజీనామా చేయించి తెలంగాణా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి రెండు కీలక పదవులు కట్టబెట్టారు. కానీ ఆ తరువాత, ప్రభుత్వంలో కానీ పార్టీలో గానీ ఆయన తన ఉనికిని చాటుకోలేకపోయారు. అదే కారణం చేత పార్టీలో, ప్రభుత్వంలో తగిన గుర్తింపు, గౌరవం పొందలేకపోయారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువే. కనుక ఆయనే లోకేష్ కి ఫోన్ చేసి తన గోడు చెప్పుకొని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నాలుగైదు రోజులలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఆయన పదవికి ఎసరు తెచ్చేవిగానే కనబడుతున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం ఏపితో కోట్లాడి మరీ స్వంతంగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించుకొంటోంది. తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంసెట్-2 పరీక్షా పత్రాలు లీక్ అవడంతో, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెతి పోస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్, కడియం రాజీనామాలకి డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో హైకోర్టు తెలంగాణా ప్రభుత్వం యూనివర్సిటీల విసిల నియామకాల కోసం జారీ చేసిన జీ.ఓ.ని రద్దు చేయడంతో తెరాస ప్రభుత్వం, ఆయన కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కనుక ఒకవేళ ఈ కారణాల చేత ఆయన పదవిలో నుంచి దిగిపోవలసి వస్తే, లోకేష్ చెపుతున్న మంత్రి ఆయనే అని భావించవచ్చు.