ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మామూలు సైకో కాదు. సోషల్ మీడియాలో నేరుగా తన పేరునే పెట్టుకుని టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా తిట్టిన వ్యక్తి. పుట్టుకల్ని, అక్రమ సంబంధాలను యథేచ్చగా అంటగట్టిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఏ సందర్భంలో అయినా నారా లోకేష్‌తో షేక్ హ్యాండ్ ఇస్తాడని ఎవరైనా ఊహించగలరా? . అలా జరిగితే టీడీపీ కార్యకర్తలు ఎలా రెస్పాండ్ అవుతారు ?. ఇప్పుడు అదే జరిగింది. కార్యకర్తలు ప్రతీ దానికి ఓవర్ గా రియాక్టవుతున్నారని నిందించడం సులువే కానీ అసలు వరుసగా తప్పులు ఎక్కడ జరుగుతున్నాయన్నది ఎందుకు గుర్తించడం లేదు ?
సిస్కో టీమే కానీ ఎవరు వస్తున్నారో చూసుకోరా ?
సిస్కో అత్యున్నత సాఫ్ట్ వేర్ కంపెనీ కావొచ్చు. లోకేష్ ను కలిసేందుకు వచ్చే వారి జాబితా వారి వద్ద రెడీగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకునే టీమ్ ఉండదా?. పైగా ఇప్పాల రవీంద్రారెడ్డి అసలు ఎంవోయూను సమన్వయం చేశాడట. అంటే అధికారులతో చాలా సార్లు మాట్లాడి ఉంటాడు. మరి అతనెవరో తెలియకుండా ఉంటుందా?. అతను ఇప్పాల రవీంద్రారెడ్డి అని లోకేష్‌కు తెలియకపోవచ్చు కానీ.. ఖచ్చితంగా అతను ఆ సోషల్ కీచకుడే అని లోకేష్ టీంకు తెలిసి ఉంటుంది.. తెలుసుకుని ఉండాలి కూడా. కానీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు.
కార్యకర్తలు రెచ్చగొట్టినా తప్పు లేదు !
రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి కార్యకర్తల్ని వ్యక్తిగతంగా తిట్టలేదు. ఆయన తిట్టింది చంద్రబాబును, నారా లోకేష్‌ను..భువనేశ్వరిని .. టీడీపీని. అందుకే టీడీపీ కార్యకర్తలు అతని నీడను కూడా ఏ మాత్రం సహించరు. ఈ విషయంలో తప్పు జరిగింది లోకేష్ టీం వైపు నుంచి. ఒకటి కాదు.. రెండు కాదు.. పదే పదే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. కార్యకర్తల్ని ఆవేదనకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో ఎందుకు ఊహించడం లేదు…?. ఇప్పాలతో లోకేష్ ఫోటో క్రాప్ చేసినా చేయకపోయినా.. వ్యక్తిగత భేటీ అయినా కాకపోయినా.. టీడీపీ కార్యకర్తల కడుపు మండే ఫోటో అంది. అందుకే కార్యకర్తల ధర్మాగ్రహం తప్పులేదు.
టీడీపీకి నష్టం చేస్తున్నారని కొంత మంది నిష్ఠూరాలు!
సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి నేరుగా లోకేష్ ను కలవడంపై ప్రశ్నించడాన్ని టీడీపీకి నష్టం చేస్తున్నారని కొంత మంది ఎదురుదాడి చేస్తున్నారు. నిజమే.. ఎవరు టీడీపీకి నష్టం చేస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉందని మరికొంత మంది ఎదురుదాడి చేస్తున్నారు. అన్నీ లోకేష్ చూసుకోలేరు. కానీ లోకేష్ తరపున పనులు చక్కబెట్టేవారు చూసుకోవాలి. ఆయనను ఎవరు కలుస్తున్నారో.. ఎందుకు కలుస్తున్నారో బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ కూడా లేకపోతే ఇక వ్యవస్థ ఎందుకు?. రవీంద్రారెడ్డి అనే సోషల్ సైకో అని .. లోకేష్ చుట్టుపక్కల వారికి తెలియకుండా అక్కడి వరకూ రారు. ఖచ్చితంగా తెలుసు. తెలిసే తప్పు జరిగింది. ఇలాంటి
తప్పులు చేసేవారే టీడీపీకి నష్టం చేస్తున్నారు కానీ.. ప్రశ్నించేవారు కాదు.
చక్కదిద్దుకోకపోతే కష్టమే !
నారా లోకేష్ గతంలో పార్టీ గెలిస్తే పదవులేమీ తీసుకోనని పూర్తి స్థాయిలో పార్టీ కోసమే.. కార్యకర్తల కోసమే పని చేస్తానని ప్రకటించారు. మంత్రి పదవి తీసుకోవాల్సిన అనివార్యత వచ్చి ఉంటుంది. మంత్రి పదవి తీసుకున్నా ఆయన పార్టీ మీద.. పార్టీ కార్యకర్తల మనోభావాల మీద కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఇప్పాల ఇష్యూ మరోసారి బయట పెట్టింది. ఇదే మొదటి సారి అయితే కావొచ్చు కానీ.. పదే పదే జరగడమే ఇబ్బంది పెడుతోంది.