వైయస్ జగన్మోహన్ రెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించి ఎనిమిది నెలలైనా కాక ముందే రాజకీయంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏకం గా 151 ఎమ్మెల్యే లు సాధించిన కారణంగా ప్రత్యర్థి పార్టీలను జగన్ ఉక్కిరి బిక్కిరి చేస్తారు అనుకుంటే, ప్రత్యర్థి పార్టీల కు ఆయుధాలను తానే అందించే విధం గా ఆయన ప్రవర్తిస్తున్నారు అన్న అభిప్రాయం వైఎస్ఆర్సిపి అభిమానుల నుండే వ్యక్తమవుతోంది. దీంతో ఇతర పార్టీల నేతలు జగన్ మీద విరుచుకుపడుతూ పలురకాల పేర్లు పెడుతున్నారు.
తుగ్లక్ అని పేరు పెట్టిన లోకేష్:
చరిత్ర లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కి పిచ్చి తుగ్లక్ అనే పేరు ఉంది. తన నిర్ణయాల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోకుండా తన నిర్ణయాలను అమలు చేసి, ప్రజల శాపనార్థాలు పొందిన రాజుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. దీంతో రాజకీయ విమర్శల లో పలు పార్టీలు పలు మార్లు తమ ప్రత్యర్థులను తుగ్లక్ తో పోలుస్తూ ఉంటాయి. జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాయి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియా లో జగన్ ని తుగ్లక్ తో పోలుస్తూ కొంత మంది విమర్శలు చేసేవారు.
అయితే ఎప్పుడైతే జగన్ రాజధాని మార్చాలని నిర్ణయించుకున్నారో, అప్పటి నుండి జగన్ కి తుగ్లక్ అనే పేరు, ఇతర పార్టీల అభిమానుల లో, సోషల్ మీడియాలో మారు మోగిపోయింది. అంతే కాకుండా లోకేష్ ఒక ట్వీట్ లో జగన్ ని తుగ్లక్ గా సంభోధించిన తర్వాత, జగన్ ని రాజకీయాలలో తుగ్లక్ గా అభివర్ణించడం మరింతగా పెరిగిపోయింది.
“రివర్స్ టర్న్ జగన్” అంటూ కన్నా లక్ష్మీనారాయణ పంచ్ లు:
ఇదే కోవ లో ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా జగన్ ని “రివర్స్ టర్న్ జగన్” అంటూ సంబోధించారు. ఆయన ట్వీట్ చేస్తూ, “గతంలో బాబు ప్రభుత్వం ప్రతీ విషయంలో U టర్న్ తీసుకునేది – ప్రస్తుత జగన్ ప్రభుత్వం ప్రతీ విషయంలో రివర్స్ టర్న్ తీసుకుంటోంది..అభివృద్ధి చెందాల్సిన ఏపీకి ఇలాంటి అసమర్ధ,అవినీతి ప్రాంతీయపార్టీల వలన ప్రయోజనం శూన్యం. ఏపీలో కమలవికాసమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పరిష్కారం.” అని ఒక రెండు రోజుల కిందట రాసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన నిర్ణయాలను మార్చుకున్న ప్రతి సారి,” యూ టర్న్ బాబు” అంటూ వైఎస్ఆర్ సిపి నేతలు ఎద్దేవా చేయడం, అదేవిధంగా సాక్షి పత్రిక లో, ఛానల్ లో చంద్ర బాబు యూ టర్న్ అంటూ బ్యానర్ కథనాలు వేయడం తెలిసిందే.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రివర్స్ టెండరింగ్ విధానం మీద ఫోకస్ చేయడం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పై రివర్స్ డైరెక్షన్ లో వెళ్లడం, వంటి వాటి కారణంగా బహుశా కన్నా లక్ష్మీనారాయణ జగన్ ని రివర్స్ టర్న్ జగన్ గా అభివర్ణించి ఉండవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రద్దుల రెడ్డి అంటూ కొత్త పేరు పెట్టిన టిడిపి నాయకురాలు
టిడిపి నేత పంచుమర్తి అను రాధ మాట్లాడుతూ, బొత్స సత్య నారాయణ పెద్ది రెడ్డి వంటి నేతలు ఇటీవల ఎక్కువగా మాట్లాడడానికి కారణం ముఖ్యమంత్రి పదవి కోసమే అంటూ ఆరోపించారు. జగన్ గనక జైలుకు వెళితే తాము ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో నే వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆవిడ అన్నారు. అయితే జగన్ ని ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర “రద్దుల రెడ్డి” గా గుర్తు పెట్టుకుంటుంది అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు.
ఇటీవల శాసన మండలి ని రద్దు చేయడం కారణం గా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ చర్చలు వాడివేడిగా జరగడం తెలిసిందే. అమరావతి ని రాజధాని గా రద్దు చేయడం, శాసన మండలిని రద్దు చేయడం, పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ లను రద్దు చేయడం వంటి పలు అంశాలని జగన్ ను రద్దు చేసిన కారణంగా బహుశా ఆవిడ జగన్ కి రద్దుల రెడ్డి అని పేరు పెట్టి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది
ఏది ఏమైనా అఖండ మెజారిటీ తో అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లోనే వైయస్ జగన్ పై ఈ విధమైన విమర్శలు, సెటైర్లు రావడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.