జలసిరికి హారతి అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కారు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నదులు, వాగులు, వంకలు.. ఇలా అన్ని చోట్లా హారతులు ఇవ్వడం ప్రారంభించారు! దీన్లో భాగంగా మంత్రి నారా లోకేష్ కూడా అమరావతిలోని విద్యాధరపురం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకేష్ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మనందరికీ తెలిసిందేననీ, కట్టుబట్టలతో మనల్ని బయటకి గెంటేశారన్నారు. విభజన తరువాత ఒక రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తే, మనకు అప్పులు ఎక్కువగా వచ్చాయన్నారు. అందుకే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ చంద్రబాబునాయుడు నీరు గురించే ఆలోచించారన్నారు. వర్షం పడినా పడకపోయినా, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి నీరు అందించాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్లారన్నారు.
ఈరోజు జరుగుతున్నది ఒక పవిత్రమైన కార్యక్రమమనీ, అందుకే బాగా వర్షం కురుస్తోందన్నారు! జలసిరికి హారతి అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడైతే ప్రకటించారో, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఎక్కడ చూసినా విస్తారంగా వానలు పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం కుప్పంలో దాదాపు 80 శాతం తక్కువ వర్షం పడిందని అనుకుంటే, జలసిరికి హారతి అనే కార్యక్రమం ప్రకటించిన తరువాత ఇప్పుడు 80 శాతం ఎక్కువ వర్షం పడటం జరిగిందన్నారు. అంటే, ఈ ప్రోగ్రామ్ కి అంత మహత్తు ఉందన్నమాట! ఎక్కడైనా వర్షం కావాలనుకుంటే ఇలా హారతిస్తే సరిపోతుందన్నమాట..! లోకేష్ మాటలు వింటుంటే ఇంతే నమ్మకంగా అనిపిస్తున్నాయి. అయినా, ఈ సీజన్లో వర్షాలు పడటం అనేది సహజం. ఇలాంటప్పుడు జలసిరికి హారతి అనే కార్యక్రమం పెట్టారు. నిజానికి, ఇదే ఒక సెంటిమెంట్ కలగలిపిన ప్రోగ్రామ్. పూజలు చెయ్యకూడదని ఎవ్వరూ చెప్పరుగానీ, దాన్నే ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసి చేయాల్సిన అవసరం ఏముంటుంది..?
నీటి వనరులను కాపాడుకోవాలి, వర్షపు నీటిని ఒడిసి పట్టాలి, భూగర్భ జల మట్టాన్ని పెంచుకోవాలి… వీటిపై ప్రజల్లో అవగాహన పెంచడం కచ్చితంగా మంచి పనే. ఆ దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం కూడా ప్రశంసనీయమే. అయితే, ఇలాంటి కార్యక్రమాలను కూడా సెంటిమెంట్ కోణం నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మంత్రి లోకేష్ చేస్తున్నారు. మామూలుగానే చంద్రబాబు నాయుడుకి సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ అంటారు. ఇప్పుడు అదే బాటలో లోకేష్ కూడా వాటినే నమ్ముతున్నట్టున్నారు! లేదంటే.. వర్షానికీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికీ లింకేంటి చెప్పండీ..? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు అనే సెంటిమెంటును కొన్నాళ్ల కిందట వైకాపా నేతలు తరచూ చెబుతూ ఉండేవారు. ఆయన ఒక కార్యక్రమం చేపడితే చాలు భారీగా వర్షాలు కురిసేస్తాయని చినబాబు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఇది పార్టీకి ఉపయోగపడొచ్చు.