మంగళగరిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో తాను ఐదు వేల ఓట్లతో ఓడిపోయానని ఈ సారి యాభై వేల ఓట్లతో గెలుస్తానని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు మాత్రం ఆయనకు 91వేల మెజార్టీ ఇచ్చారు. అంటే.. ప్రజలపై ఆయన పెట్టుకున్న నమ్మకం కంటే..ప్రజలే ఆయనపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఇది లోకేష్ పనితీరుతోనే సాధ్యమయింది.
మంగళగిరిలో పోటీ చేసినప్పుడు అందరూ రాజధాని ప్రాంతమని పోటీ చేస్తున్నారని ఆరోపించారు. వారి ఉద్దేశంలో అది కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గం అని. అప్పటికే అమరావతిపై కమ్మ ముద్ర వేసిన కుల పిచ్చి రాజకీయలు చేసే వాళ్లు .. చాలా మందిని నమ్మించారు. నిజమేమిటంటే మంగళగిరిలో ఐదు శాతం కూడా కమ్మలు ఉండరు. అలా రెచ్చగొట్టి లోకేష్ పై కుల ప్రయోగం చేశారు. ఫలితంగా ఐదు వేల ఓట్లతో పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత మంగళగిరి నియోజకవర్గం వద్దని.. సేఫ్ సీటు చూసుకోవాలని చాలా మంది సలహాలిచ్చారు. కానీ లోకేష్ ఓడిన చోటే గెలవాలని పట్టుదలకు వచ్చారు. అనుకున్నట్లుగా తర్వాత రోజు నుంచి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టంలో తన భాగం పంచుకోవడం ప్రారంభించారు. లోకేష్ కు 91వేలకుపైగా మెజారిటీ వచ్చింది. ఇక్కడ పులివెందులలా ఫ్యాక్షన్ గ్రామాలు లేవు ఓట్లు గుద్దేసుకోవడానికి. ప్రతి ఒక్క ఓటు.. లోకేష్ ..తమకు అందుబాటులో ఉంటాడన్న కారణంగానే వేసిన ఓటే. ఓడిపోయినా సరే.. తమకు చేసిన సేవలకు ప్రతిఫలంగా వేసిందే.
ఓ ప్రత్యేకమైన బృందాన్ని నియమించుకుని నారా లోకేష్ మంగళగిరిలో రాజకీయం చేశారు. నియోజకవర్గంలో ఎవరి ఇంట్లో శుభకార్యమైనా లోకేష్ నుంచి పలకరింపు వెళ్తుంది. విషాదం అయినా ధైర్యం చెప్పేందుకు ముందు ఉంటారు. మహిళల ఉపాధి పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేనేతలకు కొత్త పద్దతుల్లో మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కల్పించారు. లోకేష్ సొంత డబ్బుతో చేసిన సేవలు ప్రజల్ని మెప్పించాయి. రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలతో రోజూ సమావేశం అయ్యారు. అపార్టుమెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించి తన విజన్ చెప్పారు.