తమిళనాడు ప్రజల్లో తెలుగు మూలాలున్న వారు 40 శాతం మంది ఉంటారని అంచనా. డీఎంకే ఫ్యామిలీ కూడా తెలుగు వారేనని చెబుతారు . ఎంత మంది ఉంటారన్న సంగతిని పక్కన పెడితే.. ఇప్పటికీ తెలుగు మాట్లాడుతూ .. తెలుగు సంప్రదాయాల్ని పాటించే వారు లక్షల్లో ఉంటారు. వీరి మద్దతు కోసం రాజకీయ పార్టీలు తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాయి.
తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ .. తెలుగు ఓటర్ల కోసం … టీడీపీ నాయకుల్ని ప్రచారానికి ఆహ్వానిస్తోంది. కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేస్తున్నారు. అక్కడ తెలుగు వ్యాపారులు.. ఇతర వర్గాలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారందర్నీ ఓట్లు అడిగేందుకు నారా లోకేష్‌ను అహ్వానించారు. ఆయన గురువారం పర్యటించి.. ప్రచారం చేయనున్నారు.
చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత .. నారా లోకేష్ కు జాతీయస్థాయి కవరేజీ లభించింది. ఆర్నాబ్ తో ఆయన ఇంటర్యూ.. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ చేసిన సవాల్ వైరల్ అయింది. జాతీయ మీడియా ఇంటర్యూల్లో సూటిగా, స్పష్టంగా బెరుకులేకుండా ఇచ్చిన సమాధానాలతో ఆయన ఇతర రాష్ట్రాలకూ పరిచయమయ్యారు. ఈ కారణంగా పొత్తుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం చేయాలని బీజేపీ కోరుతోంది.