లోకేశ్ మంత్రి కావడంలో తప్పేమీ లేకపోవచ్చు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ పుత్రులకు పగ్గాలిస్తున్నాయి గనక సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ బాధ్యతలు చేపట్టాక కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి వుంటుంది. లోకేశ్ ముందు తెలుగులో ఇంగ్లీషులో కూడా తడబడకుండా మాట్లాడ్డం నేర్చుకుంటే తర్వాత చలోక్తులు జోకులు చూసుకోవచ్చు.కాని ఆయన ఇప్పటికి మూడు నాలుగు సార్లు తడబడిపోయారు. ప్రమాణస్వీకారంలోనే పొరబడ్డం ఒకటైతే ఒకసారి టిడిపికి శ్రద్దాంజలి అన్నట్టు మాట్లాడి సర్దుకున్నారు. మరోసారి అంబేద్కర్ జయంతిని వర్దంతి చేశారు. తాజాగా తూర్పు గోదావరి పర్యటనలో ఇబ్బంది లేకుండా నీరు ఏర్పాటు చేస్తామని చెప్పేబదులు ఏదేదో కంగారు పడి ఇబ్బంది ఏర్పాటు చేస్తామని చెప్పి మళ్లీ సరిచేసుకున్నారు. పోనీలే అనుకుంటే ఆ సందర్భంలోనే పల్లె తల్లిలాటిదైతే పట్నం ప్రియురాలు అంటూ ఏదో చమత్కారం చేయబోయారు. నిజంగా ఈ మాటలకు అర్తాలు తీసుకుంటే అనర్థాలు తప్పవు. పట్టణంలోనే పెరిగిన తాను కావాలని అడిగి ఈ శాఖ తీసుకున్నానని లోకేశ్ చెబుతున్నారు గాని అసలు కారణం వేరు.ఈ శాఖకు నిధులు ఎక్కువ. వరుసగా పనులకు శంకుస్థాపనలు చేసుకుంటూ పోతే ఎక్కద చూసిన లోకేశ్ శిలాఫలకాలే కనిపిస్తాయట. ఆ మేరకు అన్నిటినీ ఆయన దగ్గర కేంద్రీకరించే ప్రక్రియ కూడా జరిగిపోతున్నది.