నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. పాదయాత్ర రాజకీయాల్లో సెంటిమెంట్‌గా మారిపోయింది. ప్రతీ ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్ర చేయడం కామన్‌గా మారిపోయింది. ఇప్పడంతా పాదయాత్రల సీజన్ నడుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం మూడు వేల కిలోమీటర్లకుపైగా తిరిగిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో అదే పని చేస్తున్నారు. ఏపీలో నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు.
పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తారని అభిమానులు చాలా ఆశపడ్డారు కానీ ఆయన బస్సు యాత్రకే పరిమితమయ్యారు. దసరా నుంచి ప్రారంభిస్తున్నారు. లోకేష్ మాత్రం సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వరకూ పాదయాత్ర జరగనుంది. ఇటీవలి కాలంలో లోకేష్ పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆయన పర్యటనలపై క్యాడర్ ఆసక్తికరంగా స్పందిస్తోంది. జనవరి కల్లా పార్టీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చూసుకుంటే.. లోకేష్ పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం వైసీపీ జనానికి దూరంగా ఉంటోంది. సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. పరదాలు కట్టుకుని జిల్లాల్లో పర్యటించడం మినహా ఆయ నచేస్తున్నదేం లేదు. అధికార పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలం కావడంతో గడప గడపకూ వెళ్తన్న ప్రజాప్రతినిధులపై అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ప్రజలందరికీ భరోసా ఇవ్వడానికి.. పార్టీకి ఊపు తేవడానికి లోకేష్ పాదయాత్ర ఉపయోగపడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.