వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, వ్యవస్థలను మాఫియాగా వాడుకున్న వైనం అనేకం బయటకు వస్తున్నాయి. సినీ నటి జత్వానీని వేధించిన కేసు దగ్గర నుంచి తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి స్కాం వరకూ ఇంత అడ్డగోలుగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారా అని ప్రజలు ఆశ్చర్యపోయేంతగా ఘోరాలు బయటకు వస్తున్నాయి. కానీ అన్నీ మీడియా ద్వారా ప్రజల ముందుకు వస్తున్నాయి కానీ ఎన్ని వాటిల్లో చర్యలు తీసుకుంటున్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. కేసులు పెడుతున్నారు కానీ.. ఆ కేసులు అలాగే ఉంటున్నాయి. నిందితులు వారి పనులు వారు చేసుకుంటున్నారు. వారు దోచుకున్నవి అనుభవిస్తున్నారు. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
జత్వానీ కేసు అత్యంత ఘోరం. ప్రతి సామాన్యుడికి ఇలా తమకు జరిగితే ఎలా అని భయం పుట్టించే కేసు. పోలీసులు ఓ మాఫియాగా మారితే ఇలా చేస్తారన్నది వ్యవస్థను అపహాస్యం చేసిన కేసు. మీడియాలో వచ్చిన దాని ప్రకారం పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఎందుకు అరెస్టులు చేయడం లేదో ప్రభుత్వానికే తెలియాలి. ఆ తప్పులు చేసిన పోలీసులందర్నీ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలుకు పంపాలి. అలా చేస్తేనే ఆ వ్యవస్థలో మరొకరు అలాంటి తప్పు మరొకరు చేయరు.కానీ ఆ నిందితులు దిలాసాగా ఉన్నారు.ఆ ఒక్క కేసు కాదు.. లిక్కర్ స్కాం, గనుల స్కాం, ఇసుక స్కాం, భూముల దోపిడీ స్కాం, అసైన్డ్ స్కాం , ఫ్రీహోల్డ్ పేరుతో భూముల్ని కొట్టేసిన స్కాం .. బేపార్క్,కాకినాడ పోర్టు ఇలా ప్రైవేటుఆస్తుల్ని కొట్టేసిన స్కాం.. తాజాగా రీతూచౌదరి చేసిన దోపిడి ఇలా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కానీ చర్యల విషయంలో మాత్రం ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లుగా కనిపించడం లేదు.
త్వరలోనే వైసీపీ హయాంలోజరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని విశాఖలో నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఆ త్వరలోనే అన్న మాట .. టీడీపీ క్యాడర్ కు సైతం ఇరిటేషన్ తెప్పిస్తోంది. అధికారం అందిన ఏడు నెలల తర్వాత కూడా ఇంకా త్వరలోనే అనే మాట వారికి అంత వినసొంపుగా ఉండదు. కక్ష సాధింపులు చేయాలని ఎవరూ అడగడం లేదు. వారు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మాత్రం కోరుతున్నారు. అలా చేస్తేనే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది.