ఆగస్టు 15వ తేదీ నాడు గుంటూరు నడిబొడ్డున, పట్టపగలు జరిగిన విద్యార్థిని రమ్య హత్య అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. విపక్ష నేతలను పరామర్శించాడానికి కూడా పోలీసులు అంగీకరించకపోవడంతో వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రమ్య మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన పోలీసులు నిన్న తల్లిదండ్రులకు అప్పగించలేదు. ఈ రోజు ఉదయం అప్పగించారు. ఆ సమయంలో ఆస్పత్రి వద్ద రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. పోటీగా వైసీపీ కార్యకర్తలు వారి మీదకు రావడం.. పోలీసులు చూస్తూ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత హోంమంత్రి సుచరిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన రూ. పది లక్షల చెక్‌ను అందించారు.
టీడీపీ యువ నేత నారా లోకేష్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పరమయ్య కుంటకు వచ్చారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో గందరగోళం ఏర్పడింది. రమ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చెల్లెలుకే భద్రత లేదని.. జగన్ మిట్ట మద్యాహ్నం నిద్రపోతారని మండిపడ్డారు. అయితే పోలీసులు లోకేష్ పరామర్శ పూర్తయిన తర్వాత ఆయనను అక్కడ్నుంచి పంపడానికి రూట్ క్లియర్ చేయాల్సింది పోయి అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్‌బాబులతో పాటు పలువుల్ని అరెస్ట్ చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగతా వాళ్లని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
రాజకీయ పరామర్శలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం … వివాదాస్పమవుతోంది. పోలీసులు నిందితుల్ని పట్టుకునే విషయంలో చేతకాని విధంగా వ్యవహరిస్తారని అదే బాధితుల్ని మాత్రం వెంటనే అరెస్ట్ చేస్తారని టీడీపీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ఎందుకు ఇంత వరకూ బాధితురాల్ని పరామర్శించలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి గండికొట్టేలా ఉందని… పోలీసులపై తక్షణం చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.